Post Office : భారత తపాలా శాఖ తమ కస్టమర్ల కోసం సరికొత్త, అత్యంత సులువైన డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దీనివల్ల ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి ఎలాంటి పేపర్లు, పే-ఇన్ స్లిప్పులు నింపాల్సిన అవసరం లేదు. గతంలో ఈ అధునాతన సౌకర్యం కేవలం మెయిన్ పోస్టాఫీసులలో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు దీనిని చిన్న బ్రాంచ్‌లకు కూడా విస్తరించారు.

నగదు లావాదేవీల పరిమితులు ఇవే

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న అర్హులైన ఖాతాదారులు ఏ బ్రాంచ్ పోస్టాఫీసులోనైనా కేవలం డిజిటల్ అథెంటికేషన్ ద్వారా రూ. 50,000 వరకు నగదును సులభంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (POSA) ఉన్నవారు ఎలాంటి విత్‌డ్రాయల్ ఫామ్స్ లేకుండానే నేరుగా రూ.20,000 వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరపాలనుకుంటే మాత్రం, పాత పద్ధతిలోనే పేపర్ డాక్యుమెంట్లను సమర్పించి, సంబంధిత హోమ్ బ్రాంచ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ మూడు రకాల ఖాతాలకే ప్రస్తుతానికి ఛాన్స్

ఈ సరికొత్త పేపర్‌లెస్ లావాదేవీల సౌకర్యం ప్రస్తుతానికి కొన్ని రకాల పొదుపు ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని తపాలా శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా.. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (POSA), రికరింగ్ డిపాజిట్ (RD) అకౌంట్, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA) ఉన్నవారికి ఈ ఈ-కేవైసీ డిపాజిట్, విత్‌డ్రాయల్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ సౌకర్యం కేవలం సింగిల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ ఖాతాలు, జాయింట్ ఖాతాలకు ప్రస్తుతానికి ఈ పద్ధతిని వర్తింపజేయడం లేదు.

దేశంలో ఏ పోస్టాఫీస్ నుంచైనా లావాదేవీలు

తపాలా శాఖ చేసిన మరో కీలక మార్పు ఏమిటంటే, ఒక కస్టమర్ తన ఆధార్ అథెంటికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే, అతను తన ఖాతా ఉన్న బ్రాంచ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. దేశంలోని ఏ మూలలో ఉన్న బ్రాంచ్ పోస్టాఫీస్ నుంచైనా తన అకౌంట్ ద్వారా నగదు బదిలీలు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఖాతాకు ఆధార్ లింక్, అథెంటికేషన్ పూర్తి కాకపోతే మాత్రం, కేవలం మీ ఖాతా ఏ బ్రాంచ్‌లో అయితే ఓపెన్ చేశారో, అక్కడ మాత్రమే లావాదేవీలు జరుపుకోవడానికి వీలుంటుంది.

సెప్టెంబర్ 1, 2026 నుంచి మొబైల్ నెంబర్ తప్పనిసరి

కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్‎లో ఆధార్ నెంబర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ రెండు ఖచ్చితంగా నమోదై ఉంటేనే ఈ-కేవైసీ సేవలు సజావుగా సాగుతాయి. ఈ క్రమంలో తపాలా శాఖ ఒక ముఖ్యమైన డెడ్‌లైన్‌ను కూడా విధించింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి పోస్టాఫీస్ అకౌంట్లకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం పూర్తిగా విధిగా మార్చనున్నారు. ఈ తేదీ లోపు మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయని ఖాతాదారులు పోస్టాఫీస్ అఫీషియల్ DREAM యాప్ ద్వారా ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరపడానికి వీలుండదని అధికారులు హెచ్చరించారు.

ఆధార్ సమాచార భద్రత - మాస్క్‌డ్ ఆధార్ నిబంధన

ఈ-కేవైసీ ప్రక్రియ కోసం కస్టమర్ డిజిటల్ అంగీకారం తెలిపిన తర్వాత, యూఐడీఏఐ డేటాబేస్ నుంచి వారి పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ వంటి వివరాలను సిస్టమ్ సేకరిస్తుంది. ఈ ప్రక్రియలో కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతను కాపాడటానికి తపాలా శాఖ అన్ని బ్రాంచ్‌లకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. పోస్టాఫీస్ రికార్డులలో లేదా ఖాతా పత్రాలలో ఎక్కడా పూర్తి ఆధార్ నెంబర్ కనిపించకుండా, కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా మాస్క్‌డ్ ఆధార్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story