Post office : యుద్ధం వస్తే ఏంటి.. మార్కెట్ పడితే ఏంటి.. పోస్టాఫీస్ ఈ స్కీమ్ ఉంటే నెలకు రూ.5,550 పక్కా
పోస్టాఫీస్ ఈ స్కీమ్ ఉంటే నెలకు రూ.5,550 పక్కా

Post office : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోతున్నారు. షేర్ల ధరలు ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలియక సామాన్య ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో "నా రూపాయి భద్రంగా ఉండాలి.. దాంతో పాటు నెలకు కొంత ఆదాయం రావాలి" అని కోరుకునే వారికి పోస్టాఫీసు పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక వరప్రదాయినిగా మారింది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రతి నెలా మీ చేతికి నగదు అందించే అద్భుతమైన పథకం ఇది.
ఈ పథకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే.. ఇది పూర్తిగా ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న స్కీమ్. అంటే మీరు దాచుకున్న అసలు సొమ్ముకు నయా పైసా కూడా నష్టం వాటిల్లదు. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఈ పథకంలో మీరు ఒక్కసారి పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తే చాలు.. ఆ మరుసటి నెల నుంచే మీకు వడ్డీ రూపంలో ఆదాయం రావడం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కంటే ఇది మెరుగ్గా ఉండటం విశేషం. ముఖ్యంగా ఇంటి ఖర్చుల కోసం ఇబ్బంది పడే గృహిణులకు, పెన్షన్ తక్కువగా వచ్చే వృద్ధులకు ఇది భరోసా ఇస్తోంది.
ఈ స్కీమ్ లెక్కలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మీరు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, నెలకు సుమారు 600 రూపాయల పైనే వడ్డీ వస్తుంది. అదే 5 లక్షలు పెడితే నెలకు 3 వేల రూపాయలకు పైగా ఆదాయం మీ సొంతం. ఒకవేళ మీరు గరిష్ట పరిమితి అయిన 9 లక్షల రూపాయలను సింగిల్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా మీకు ఏకంగా 5,550 రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి వస్తాయి. ఈ పథకంలో కేవలం వెయ్యి రూపాయలతో కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఐదేళ్ల తర్వాత మీ అసలు సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తారు లేదా మీరు మళ్ళీ ఇంకో ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగించవచ్చు.
జాయింట్ అకౌంట్ హోల్డర్లకు ఈ పథకం మరింత ప్రయోజనకరం. భార్యాభర్తలు కలిసి జాయింట్ ఖాతా తెరిస్తే గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అప్పుడు నెలవారీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు రక్తసిక్తమవుతున్న వేళ, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల వరకు వడ్డీ రేటు మారదు.. మార్కెట్ కూలినా, నింగికెగసినా మీ ఆదాయం మాత్రం ఫిక్స్‌డ్‌గా వస్తూనే ఉంటుంది. అందుకే ఈ కష్టకాలంలో అందరూ పోస్టాఫీసు వైపు అడుగులు వేస్తున్నారు.

