నెలకు రూ.9,250 ఆదాయం, 5 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బు వెనక్కి

Post Office :పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ఇంటి నెలవారీ ఖర్చులను నిర్వహించడం, ముఖ్యంగా రిస్క్ తీసుకోదలచుకోని సీనియర్ సిటిజన్స్‌కు, స్థిర ఆదాయం లేనివారికి పెద్ద సవాలుగా మారింది. అలాంటి వారికి, ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన, హామీతో కూడిన ఆదాయం వస్తే గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి భారతీయ పోస్టాఫీస్ అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పథకం అమలు చేస్తోంది. అదే పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ.9,250 వరకు స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, 5 సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి సురక్షితంగా తిరిగి వస్తుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది కేవలం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే, దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా చెల్లించే ఒక సులభమైన, సురక్షితమైన పథకం. ఈ పథకంలో మీరు ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక వడ్డీని లెక్కించి, ఆ మొత్తాన్ని 12 సమాన భాగాలుగా చేసి, ప్రతి నెలా మీ పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలోకి బదిలీ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకంపై 7.40 శాతం ఆకర్షణీయమైన వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి, మీ మూలధనంపై 100% భద్రత ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో దీనికి సంబంధం లేదు.

నెలకు రూ.9,250 ఎలా పొందవచ్చు?

ఈ పథకంలో వ్యక్తిగత ఖాతా, జాయింట్ అకౌంట్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఒక వ్యక్తి సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.

నెలవారీ ఆదాయం: రూ.9 లక్షలు (పెట్టుబడి)*7.40% / 12 = రూ.5,550 (ప్రతి నెలా స్థిరంగా లభిస్తుంది).

భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే, పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలకు పెరుగుతుంది.

నెలవారీ ఆదాయం: రూ.15 లక్షలు (పెట్టుబడి)*7.40% / 12 = రూ.9,250(ప్రతి నెలా స్థిరంగా లభిస్తుంది).

కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి తమ మూలధనం సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యం. POMIS ఆ హామీని ఇస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఈ 5 ఏళ్ల పాటు మీ పెట్టుబడి లాక్ చేయబడుతుంది. 5 సంవత్సరాలు పూర్తి కాగానే, మీరు ప్రతి నెలా వడ్డీ ప్రయోజనం పొందిన తర్వాత, మీ మొత్తం పెట్టుబడి రూ.9 లక్షలు లేదా రూ.15 లక్షలు మీకు సురక్షితంగా వెనక్కి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే, 1 సంవత్సరం తర్వాతే సాధ్యమవుతుంది. అయితే, 1 నుంచి 3 సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేస్తే కొంత పెనాల్టీ పడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story