Post Office : పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ.15 లక్షలు పెడితే.. ప్రతి నెల రూ.9,250 గ్యారెంటీ ఆదాయం
రూ.15 లక్షలు పెడితే.. ప్రతి నెల రూ.9,250 గ్యారెంటీ ఆదాయం

Post Office : మారిన కాలంలో పెట్టుబడి పెట్టేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సామాన్యులు మాత్రం ఇప్పటికీ నమ్మకమైన, సురక్షితమైన ప్రభుత్వ పొదుపు పథకాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి, రిస్క్ లేకుండా ప్రతి నెల స్థిరమైన ఆదాయం ఆశించే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పూర్తి మద్దతు, గ్యారెంటీ ఉండటం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల రిస్క్ అస్సలు ఉండదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ స్కీమ్‌లో ఒకే ఖాతా (సింగిల్ అకౌంట్) ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఏటా 7.4 శాతం స్థిరమైన వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద కేవలం రూ.1,000 కనీస మొత్తంతో కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒకసారి ఒకే విడతలో పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌లో ప్రతి నెల మీ చేతికి వడ్డీ రూపంలో లాభం అందుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంది.
మీరు మీ భాగస్వామితో కలిసి ఈ స్కీమ్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలను ఇన్వెస్ట్ చేస్తే.. ప్రస్తుత 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల మీకు రూ.9,250 వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఈ విధంగా ఐదేళ్ల కాలపరిమితిలో మీరు కేవలం వడ్డీ రూపంలోనే ఏకంగా రూ.5.55 లక్షల లాభాన్ని ఆర్జించవచ్చు. గడువు ముగిసిన తర్వాత మీ అసలు సొమ్ము రూ.15 లక్షలు మీకు క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది.
ఒకవేళ మీరు సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల మీ అకౌంట్లోకి రూ.5,550 వడ్డీ సొమ్ము వచ్చి చేరుతుంది. దీని ద్వారా ఐదేళ్లలో మీకు వచ్చే మొత్తం వడ్డీ లాభం రూ.3,33,000గా ఉంటుంది. ఈ పథకంలో ఒక జాయింట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు భాగస్వాములుగా చేరేందుకు కూడా పోస్టల్ శాఖ అనుమతి ఇస్తుంది.
అకౌంట్ మధ్యలోనే క్లోజ్ చేస్తే జరిమానా తప్పదు
ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. పోస్టాఫీస్ ఎంఐఎస్ ఖాతాను తెరిచిన ఒక సంవత్సరం లోపు ఎలాంటి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసిన 1 నుంచి 3 సంవత్సరాల మధ్యలో డబ్బులు అవసరమై క్లోజ్ చేస్తే.. మీ అసలు డిపాజిట్ సొమ్ము నుంచి 2 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్ చేస్తారు. అలాగే, 3 సంవత్సరాల తర్వాత ఖాతాను ముందస్తుగా మూసివేస్తే 1 శాతం పెనాల్టీ విధిస్తారు.
టాక్స్ రూల్స్, ఇతర ఫీచర్లు
ట్యాక్స్ విషయాలు: ఈ స్కీమ్‌లో పెట్టే పెట్టుబడులకు పాత పన్ను విధానం కింద ఎలాంటి సెక్షన్ 80C మినహాయింపులు లభించవు. వచ్చే నెలవారీ వడ్డీ మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పూర్తిగా టాక్సబుల్ అవుతుంది. అయితే, పోస్టాఫీస్ ఈ వడ్డీ చెల్లింపులపై ఎలాంటి టీడీఎస్ కట్ చేయదు. మీరు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు మీ పీఓఎంఐఎస్ అకౌంట్‌ను దేశంలోని ఏ పోస్టాఫీస్‌కైనా సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత, అదే సొమ్మును మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది.

