Postoffice : 25 ఏళ్లలో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? పోస్టాఫీసు పథకంలో ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టండి
పోస్టాఫీసు పథకంలో ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టండి

Postoffice : పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించే ఒక పథకం. దీనికి కనీస లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఒక పక్కా దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఆ తర్వాత కూడా పెట్టుబడిని ఐదేళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టి 25 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు.
ఏమిటి ఈ PPF పథకం?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద భారతదేశంలోని ఏ పౌరుడైనా అకౌంట్ తెరవవచ్చు. పోస్టాఫీస్, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో ఈ PPF అకౌంట్‌ను తెరవవచ్చు. ఒక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) రూ.500 నుండి రూ.1,50,000 వరకు ఎంతైనా ఈ అకౌంట్‌లో జమ చేయవచ్చు.
ప్రస్తుతం ఈ పథకంలో సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సవరిస్తారు. వడ్డీ రేటు పెద్దగా లేనప్పటికీ, పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఒక సంవత్సరంలో మీరు పీపీఎఫ్‌లో చేసే పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులకు పీపీఎఫ్ ఒక ఇష్టమైన పెట్టుబడి మార్గంగా మారింది.
సంవత్సరంలో మీరు ఎన్నిసార్లైనా పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయవచ్చు. కానీ సంవత్సరంలో మొత్తం జమ చేసే మొత్తం రూ.1.5 లక్షలకు మించకూడదు. ఒక నెలలో రూ.10,000, మరో నెలలో రూ.30,000 ఇలా మీ ఇష్టం వచ్చినట్లుగా అకౌంట్‌లో డబ్బులు జమ చేయవచ్చు. ఒక సంవత్సరంలో మీరు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తే, వచ్చే సంవత్సరంలో కూడా అదే మొత్తాన్ని జమ చేయాలనే నియమం ఏమీ లేదు. ఈ సంవత్సరం రూ.1.5 లక్షలు వేస్తే, వచ్చే సంవత్సరం కేవలం రూ.లక్ష మాత్రమే వేయవచ్చు.
పీపీఎఫ్ ద్వారా లభించే లాభం
* మీరు పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం.
* 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.22,50,000 పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీ సమయానికి మీ పెట్టుబడి విలువ రూ.40 లక్షలు దాటి ఉంటుంది.
* ఒకవేళ మీరు మీ పెట్టుబడి కాలాన్ని 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు పెంచినట్లయితే మీ మొత్తం పెట్టుబడి రూ.37,50,000 అవుతుంది. ఈ మొత్తం విలువ రూ. కోటి దాటి ఉంటుంది.
