Post Office : రోజుకు రూ.300 పొదుపు చేస్తే రూ.15 లక్షలు.. పోస్టాఫీస్ సూపర్ డూపర్ స్కీం
పోస్టాఫీస్ సూపర్ డూపర్ స్కీం

Post Office : మనం కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోవడం ఒక ఎత్తు అయితే, అది మనకు లాభాలను తెచ్చిపెట్టేలా సరైన చోట పెట్టుబడి పెట్టడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుందని భయపడే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు వరప్రసాదం లాంటివి. కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో రూపాయికి కూడా ఢోకా ఉండదు. అలాంటి పథకాల్లో ఒకటైన పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ద్వారా లక్షల రూపాయలు ఎలా సంపాదించవచ్చో చూద్దాం.
వంద రూపాయలతో ప్రయాణం మొదలు
చాలామంది దగ్గర పొదుపు చేయడానికి పెద్ద మొత్తం ఉండదు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ ఈ ఆర్డీ పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం రూ.100 తో కూడా మీరు మీ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 6.7 శాతం చక్రవడ్డీని అందిస్తోంది. అంటే మీరు ప్రతి నెలా దాచుకునే డబ్బుపై వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది, దీనివల్ల చివరలో మీకు పెద్ద మొత్తం అందుతుంది.
అత్యవసరమైతే లోన్ సౌకర్యం
ఈ స్కీమ్‌లో ఒక మంచి ఫీచర్ ఏంటంటే.. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీకు డబ్బు అవసరమైతే మీ డిపాజిట్‌పై 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. బయట పర్సనల్ లోన్ తీసుకుంటే భారీగా వడ్డీ కట్టాలి, కానీ ఇక్కడ మీరు దాచుకున్న డబ్బుపైనే చాలా తక్కువ వడ్డీకి (కేవలం 2 శాతం అదనంగా) లోన్ పొందే వెసులుబాటు ఉంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల మూడు ఏళ్ల తర్వాత ఖాతాను మూసివేయాలనుకున్నా అవకాశం ఉంటుంది.
డబ్బును రెట్టింపు చేసే వ్యూహం
ఈ పథకం కాలపరిమితి ఐదు సంవత్సరాలు. కానీ అసలైన లాభం ఎప్పుడు వస్తుందంటే.. ఐదేళ్ల తర్వాత వచ్చిన డబ్బును తీసుకోకుండా, మరో ఐదేళ్ల పాటు ఈ ఖాతాను కొనసాగిస్తే (మొత్తం 10 ఏళ్లు) చక్రవడ్డీ ప్రభావంతో మీ సంపద భారీగా పెరుగుతుంది. ఒకవేళ పొదుపు చేసే వ్యక్తి చనిపోతే, నామినీ ఆ ఖాతాను కొనసాగించవచ్చు లేదా అప్పటివరకు ఉన్న మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
రూ. 15 లక్షలు ఎలా వస్తాయి?
* మీరు రోజుకు రూ.300 పొదుపు చేస్తున్నారనుకుందాం. అంటే నెలకు రూ.9,000 అవుతుంది.
* 5 ఏళ్ల పాటు నెలకు రూ.9,000 చొప్పున దాచితే.. మీ పెట్టుబడి రూ.5.40 లక్షలు అవుతుంది.
* దీనిని మరో 5 ఏళ్లు పొడిగించి మొత్తం 10 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. మీరు జమ చేసే మొత్తం రూ.10,80,000 అవుతుంది.
* 10 ఏళ్ల తర్వాత మీకు మ్యాచ్యూరిటీ కింద రూ.15,20,889 అందుతాయి.
* ఇందులో మీరు దాచిన డబ్బు పోను.. కేవలం వడ్డీ రూపంలోనే ప్రభుత్వం మీకు రూ.4,40,889 అదనంగా ఇస్తుంది.

