Post Office : రోజుకు రూ. 333 కడితే చాలు..చేతికి రూ.17 లక్షలు..పోస్టాఫీస్ సూపర్ స్కీమ్
చేతికి రూ.17 లక్షలు..పోస్టాఫీస్ సూపర్ స్కీమ్

Post Office : భవిష్యత్తు అవసరాల కోసం రూపాయి రూపాయి పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వరం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారు ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, దీర్ఘకాలంలో ఏకంగా లక్షల రూపాయల ఫండ్‌ను ఎలా క్రియేట్ చేయవచ్చో ఈ పథకం నిరూపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, చిరుద్యోగులకు ఇది ఒక భరోసానిచ్చే పొదుపు మంత్రం.
పోస్టాఫీస్ ఆర్‌డీలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రధాన ప్రయోజనం ప్రభుత్వ భద్రత. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 6.70% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండింగ్ (చక్రవడ్డీ) అవుతుంది, దీనివల్ల మీ అసలుపై వచ్చే లాభం మరింత పెరుగుతుంది. పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లల పేరు మీద కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నా, ప్రతి నెలా కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం ద్వారా భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు లేదా పెళ్లిళ్లకు ఈ డబ్బును వాడుకోవచ్చు.
సాధారణంగా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. అయితే, అవసరమైతే మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల పాటు దీనిని పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 10 ఏళ్ల పాటు మీ పెట్టుబడిని కొనసాగించవచ్చు. ఒకవేళ మధ్యలో అత్యవసరంగా డబ్బు అవసరమైతే, 3 ఏళ్లు పూర్తయిన తర్వాత ఖాతాను క్లోజ్ చేసే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఖాతాదారుడు మరణించిన పక్షంలో నామినీ ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు లేదా పథకాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది.
రూ. 17 లక్షల మ్యాజిక్ ఎలా జరుగుతుంది?
మీరు రోజుకు సుమారు రూ. 333 పొదుపు చేయగలిగితే, నెలకు రూ.10,000 ఆర్‌డీ అవుతుంది. మొదటి 5 ఏళ్లలో మీరు జమ చేసే మొత్తం రూ. 6 లక్షలు కాగా, 6.70% వడ్డీతో మీకు సుమారు రూ. 1.13 లక్షల లాభం వస్తుంది. మొత్తం రూ. 7.13 లక్షలు అవుతుంది. 10 ఏళ్ల పాటు పొడిగిస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 12 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ ఏకంగా రూ. 5.08 లక్షల వరకు పెరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత మీ చేతికి సుమారు రూ.17.08 లక్షలు అందుతాయి. ఒకవేళ మీరు నెలకు రూ.5,000 మాత్రమే పొదుపు చేసినా, 10 ఏళ్ల తర్వాత దాదాపు రూ.8.5 లక్షల వరకు వెనకేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి దీనిని మించిన మార్గం లేదని చెప్పవచ్చు.

