Post Office : పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఇక స్కానింగే.. ఆగస్టు నుంచి డిజిటల్ పేమెంట్స్ షురూ
ఆగస్టు నుంచి డిజిటల్ పేమెంట్స్ షురూ

Post Office : పోస్ట్ ఆఫీస్‌ను తరచుగా ఉపయోగించే ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై పోస్టాఫీసు కౌంటర్లలో కూడా డిజిటల్ పేమెంట్స్ సదుపాయం ప్రారంభం కాబోతోంది. దీనితో పోస్ట్ ఆఫీస్ కూడా యూపీఐ నెట్‌వర్క్‌లో చేరినట్లే. కొత్త ఐటీ సిస్టమ్ అప్లికేషన్ ను ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమైంది. యూపీఐ సిస్టమ్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల ఇప్పటివరకు పోస్ట్ ఆఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు సాధ్యం కాలేదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీని అమలు చేస్తున్నారు.
"పోస్టాఫీసు తన ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తోంది. డైనమిక్ క్యూఆర్ కోడ్ తో లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త అప్లికేషన్లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్లు ఉన్న మౌలిక సదుపాయాలను 2025 ఆగస్టు నాటికి అన్ని పోస్టాఫీసుల్లో అమర్చే పని పూర్తవుతుందని ఆశిస్తున్నాం" అని పీటీఐ వార్తా సంస్థ తన నివేదికలో తెలిపింది.
అయితే మొదట కర్ణాటకలోని పోస్టాఫీసుల్లో కొత్త ఐటీ మౌలిక సదుపాయాలను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మైసూరులోని ప్రధాన పోస్టాఫీసులో, బాదామిలోని ప్రధాన కార్యాలయం, వాటి పరిధిలోకి వచ్చే పోస్టాఫీసుల్లో క్యూఆర్ కోడ్ ఆధారితంగా మెయిల్, పార్శిల్ బుకింగ్ సేవలను నిర్వహిస్తున్నారు. మొదటగా పోస్టాఫీసుల పీఓఎస్ కౌంటర్లలో డిజిటల్ లావాదేవీలు సాధ్యమయ్యేలా స్టాటిక్ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. అయితే, సాంకేతిక సమస్యలు, వినియోగదారులకు అసౌకర్యం కలగడం వల్ల ఈ పద్ధతిని పక్కన పెట్టి, ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు.
దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. అన్ని చోట్లా కొత్త ఐటీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్శిల్ వంటి మెయిల్ ఉత్పత్తులను పంపడం చాలా సులభం అవుతుంది. అంతేకాకుండా, పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలకు కూడా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి అవకాశం కల్పిస్తారు. అంటే, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటికి కూడా నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు కట్టొచ్చు.
