ఈ పథకంలో డబ్బులు పెడితే అధిక వడ్డీ, పన్ను రాయితీ

Post Office : పదవీ విరమణ తర్వాత జీవితం ఆర్థికంగా సురక్షితంగా, టెన్షన్ లేకుండా సాగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం అందిస్తున్న ఒక నమ్మకమైన పెట్టుబడి పథకం ఉంది. అదే పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ స్కీమ్ ముఖ్యంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం రూపొందించబడింది. ఇందులో మంచి వడ్డీతో పాటు, పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ పథకం పూర్తి వివరాలు ఏంటి? ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు? ఎంత లాభం వస్తుంది? వివరంగా తెలుసుకుందాం.

ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేకంగా ఉద్దేశించినది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ లేదా సూపర్ఆన్యుయేషన్ ద్వారా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని షరతులతో ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, రిటైర్ అయిన ఒక నెల లోపు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రక్షణ రంగంలో పనిచేసిన ఉద్యోగులు కూడా కొన్ని షరతులకు లోబడి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ఈ పథకంలో మీరు సింగిల్ అకౌంట్ తెరవచ్చు. లేదా, మీ భార్య/భర్తతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు. జాయింట్ అకౌంట్ విషయంలో, మొదటి దరఖాస్తుదారు సీనియర్ సిటిజన్ అయి ఉండాలి.

ఈ పథకంలో పెట్టుబడి పరిమితిని ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఒకప్పుడు రూ.15 లక్షలుగా ఉన్న గరిష్ట పెట్టుబడి పరిమితిని ఇప్పుడు రూ.30 లక్షలకు పెంచారు. అంటే, మీరు ఒక అకౌంట్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రస్తుతం (జూలై 2025 నాటికి), ఈ స్కీమ్‌లో ఏడాదికి 8.2% చొప్పున వడ్డీ లభిస్తోంది. ఇది చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఇది సీనియర్ సిటిజన్స్‌కు నెలవారీ ఆదాయం లాగా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షలను పెట్టుబడిగా పెడితే, మీకు ఏడాదికి సుమారు రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. అంటే, నెలకు సుమారు రూ.20,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలకు చాలా ఆసరా అవుతుంది.

ఈ పథకం కేవలం వడ్డీని మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఈ పథకంలో మీరు చేసే పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, ఇది మీకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించడమే కాకుండా, పన్ను భారాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. SCSS పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే, మీకు అవసరం అనుకుంటే పథకం మెచ్యూరిటీ అయిన తర్వాత దీన్ని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, మీరు కాలపరిమితికి ముందే డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story