PPF : చాలామందికి తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభం రావాలని ఉంటుంది. అలాంటి వారికి ఉన్న అత్యుత్తమ మార్గం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మీరు పాతికేళ్ల వయసు నుంచే పొదుపు మొదలుపెడితే, రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కాంపౌండింగ్ పవర్ కారణంగా పీపీఎఫ్ లో మీ డబ్బులు ఊహించని రీతిలో పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ పథకంలో మీరు పొందే వడ్డీపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏ వయసులో ఎంత ఆదాయం?

ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసు నుంచి ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు (నెలకు రూ.12,500) పీపీఎఫ్‎లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం. ప్రస్తుతం ఉన్న 7.1% వడ్డీ రేటు ప్రకారం మీ ప్రయాణం ఇలా సాగుతుంది:

* 40 ఏళ్ల వయసు నాటికి: అంటే 15 ఏళ్ల పెట్టుబడి తర్వాత, మీ చేతిలో దాదాపు రూ.40.68 లక్షలు ఉంటాయి.

* 50 ఏళ్ల వయసు నాటికి: మీరు పెట్టుబడిని కొనసాగిస్తే (25 ఏళ్ల పాటు), మీ ఫండ్ కోటి రూపాయల మార్కును దాటి రూ.1.03 కోట్లకు చేరుతుంది.

* 60 ఏళ్ల వయసు నాటికి: రిటైర్మెంట్ సమయానికి (35 ఏళ్ల పెట్టుబడి), మీ దగ్గర ఏకంగా రూ.2.26 కోట్లు ఉంటాయి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి కేవలం రూ.52.5 లక్షలే కాగా, వడ్డీ రూపంలోనే రూ.1.74 కోట్లు రావడం విశేషం.

ఎందుకు పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్?

ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది, బ్యాంకులు కూడా ఎఫ్డీల పై వడ్డీని కోత విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పీపీఎఫ్ ఇచ్చే 7.1% స్థిరమైన వడ్డీ రేటు చాలా ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా 30% టాక్స్ స్లాబ్‌లో ఉన్నవారికి పీపీఎఫ్ వడ్డీ అనేది ఇతర పన్ను పడే పెట్టుబడుల కంటే 10% పైగా లాభం ఇస్తున్నట్లే లెక్క. అలాగే పీపీఎఫ్ అనేది స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేని పథకం కాబట్టి, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మీ డబ్బుకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

గుర్తుంచుకోవాల్సిన కీలక నిబంధనలు

పీపీఎఫ్ ఖాతా కాలపరిమితి మొదట 15 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత మీకు కావాలంటే 5 ఏళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభించడమే కాకుండా, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం డబ్బుపై కూడా ఎలాంటి టాక్స్ ఉండదు. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వారికి ఇది ఒక పక్కా భరోసా ఇచ్చే పథకం.

PolitEnt Media

PolitEnt Media

Next Story