PPF vs SIP : సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల ఉన్నత చదువులకైనా లేదా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడవాలన్నా.. సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే వారి కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనే రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రతి నెల కేవలం రూ.2,000 పొదుపు చేసి 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. పీపీఎఫ్, ఎస్ఐపీలలో వచ్చే లాభాల మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒకవైపు పీపీఎఫ్ పూర్తి సురక్షితమైన టాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇస్తుంటే, మరోవైపు మార్కెట్ ఆధారిత ఎస్ఐపీ భారీ ఫండ్‌ను సృష్టించే అవకాశాన్ని ఇస్తోంది.

పీపీఎఫ్‌లో పెట్టుబడి.. ఎంత గ్యారెంటీ ఫండ్ వస్తుంది?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న పొదుపు పథకం. ఇందులో మార్కెట్ రిస్క్ అనేది అస్సలు ఉండదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పీపీఎఫ్‌పై ఏటా 7.1 శాతం స్థిరమైన వడ్డీ లభిస్తోంది. ఒకవేళ మీరు ప్రతి నెల రూ.2,000 (ఏడాదికి రూ. 24,000) చొప్పున 30 సంవత్సరాల పాటు పీపీఎఫ్‌లో డిపాజిట్ చేస్తే.. మీ మొత్తం పెట్టుబడి రూ.7.20 లక్షలు అవుతుంది. దీనికి ప్రభుత్వ వడ్డీ తోడై ఐదేళ్ల పొడిగింపుల ద్వారా 30 ఏళ్ల మెచ్యూరిటీ ముగిసేసరికి మీ చేతికి సుమారు రూ.24.72 లక్షల గ్యారెంటీ ఫండ్ అందుతుంది. ఇందులో కేవలం వడ్డీ రూపంలోనే మీరు రూ.17.52 లక్షల లాభాన్ని పొందుతారు. దీనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇందులో వచ్చే వడ్డీ మరియు మెచ్యూరిటీ సొమ్ముపై ఎలాంటి పన్ను ఉండదు.

మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ

మరోవైపు, ఎస్ఐపీ అనేది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్ లీనమై ఉండే పెట్టుబడి విధానం. ఇందులో రిటర్న్స్ స్థిరంగా ఉండవు మరియు మార్కెట్ హెచ్చుతగ్గుల రిస్క్ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఈక్విటీ ఎస్ఐపీలు అత్యుత్తమ లాభాలను ఇచ్చినట్లు గత చరిత్ర చెబుతోంది. ఒకవేళ మీరు అదే రూ.2,000 మొత్తాన్ని ప్రతి నెల ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపీ రూపంలో ఇన్వెస్ట్ చేసి, సగటున ఏటా 12 శాతం రిటర్న్స్ లభించినా.. 30 ఏళ్ల తర్వాత మీ అకౌంట్లో ఏకంగా రూ.70.60 లక్షలు జమ అవుతాయి. ఇందులో మీ అసలు పెట్టుబడి కేవలం రూ. 7.20 లక్షలు కాగా, సంపద సృష్టి ద్వారా వచ్చే అంచనా లాభం రూ.63.39 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. కాంపౌండింగ్ పవర్ వల్ల ఇక్కడ లాభాలు రాకెట్‌లా దూసుకెళ్తాయి.

రిస్క్, రివార్డ్

పెట్టుబడి నిపుణుల విశ్లేషణ ప్రకారం.. పీపీఎఫ్, ఎస్ఐపీ రెండూ వాటి స్థానాల్లో గొప్పవే. పీపీఎఫ్‌లో రిటర్న్స్ తక్కువగా ఉన్నప్పటికీ మీ అసలు సొమ్ముకు వంద శాతం గ్యారెంటీ ఉంటుంది. రిస్క్ అస్సలు వద్దు అనుకునే మధ్యతరగతి వారికి, సీనియర్ సిటిజన్లకు పీపీఎఫ్ బెస్ట్ ఛాయిస్. అయితే, మార్కెట్ ద్రవ్యోల్బణాన్ని అధిగమించి, ఐదేళ్లు లేదా పదేళ్లలో భారీ కార్పస్ సాధించాలనుకునే యువతకు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి ఎస్ఐపీ సరైన మార్గం. స్మార్ట్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని రెండు భాగాలూగా విభజించి కొంత పీపీఎఫ్‌లో, కొంత ఎస్ఐపీలో పెట్టడం ద్వారా అటు భద్రతను, ఇటు భారీ లాభాలను ఒకేసారి అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story