Food Inflation : కిచెన్ బడ్జెట్‌పై ద్రవ్యోల్బణం ప్రభావం.. కూరగాయలు, పప్పుల ధరలు ఎంత తగ్గాయంటే
కూరగాయలు, పప్పుల ధరలు ఎంత తగ్గాయంటే

Food Inflation : ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దీపావళి వంటి పెద్ద పండుగలు రాబోతున్న తరుణంలో, సామాన్య ప్రజలకు ఇది బోనస్‌లాంటి వార్త. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో భారీగా తగ్గి 1.54 శాతానికి చేరుకుంది. గత నెల ఆగస్టుతో పోలిస్తే ఇది 0.53 శాతం తక్కువ. అంటే, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గాయని దీని అర్థం.
ద్రవ్యోల్బణంలో 8 ఏళ్ల రికార్డు బ్రేక్
సెప్టెంబర్‌లో నమోదైన 1.54 శాతం ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో (జూన్ 2017 తర్వాత) ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా ప్రజల జేబులపై భారం తగ్గి, వారు మరింత పొదుపు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీని ఫలితంగా ఈసారి దీపావళి మరింత ఉల్లాసంగా, వెలుగులతో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కిచెన్ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం
NSO డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో కూరగాయలు, పప్పులు, నూనె, పండ్లు, ధాన్యాలు, గుడ్లు వంటి నిత్యావసర వస్తువుల ధరల్లో తగ్గుదల నమోదైంది. దీని ప్రభావం నేరుగా ప్రజల జేబుపై, ఇంటి కిచెన్ బడ్జెట్‌పై పడుతుంది. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రజల పొదుపు పెరుగుతుంది, గృహిణులు వంటి వారికి ఇంటి ఖర్చులను నిర్వహించడం సులభమవుతుంది. ముఖ్యంగా గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ సెప్టెంబర్‌లో కూరగాయల ధరలు 21.38 శాతం, పప్పులు, వాటి ఉత్పత్తుల ధరలు 15.32 శాతం తగ్గాయి.
ఆహార ద్రవ్యోల్బణం సున్నా కంటే దిగువకు
ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం తగ్గడమే. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్, ఆహార పదార్థాల ధరల తగ్గింపు వల్ల ఇది సాధ్యమైంది. సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 2.28 శాతం వద్ద నమోదైంది. డిసెంబర్ 2018 తర్వాత ఈ స్థాయికి ఆహార ద్రవ్యోల్బణం పడిపోవడం ఇదే తొలిసారి. అలాగే, వంటనూనెలు, పండ్లు వంటి వాటి ధరలు కూడా గత సంవత్సరాలతో పోలిస్తే అదుపులో ఉన్నాయి.
ధరల నియంత్రణలో జీఎస్టీ సంస్కరణల పాత్ర
వస్తువుల ధరలపై ఒత్తిడి తగ్గడానికి, ధరల్లో ఈ తగ్గుదల నమోదు కావడానికి భారత ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు కూడా ఒక ముఖ్యమైన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్టీ సంస్కరణల విస్తృత ప్రభావాన్ని రాబోయే రోజుల్లో కూడా చూడవచ్చని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు.
