PPF : మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అత్యుత్తమమైన ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. అయితే పీపీఎఫ్ కి సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. పీపీఎఫ్ ప్రాథమిక సూత్రం ఒక వ్యక్తి.. ఒకే ఖాతా. మీరు ప్రభుత్వ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు లేదా పోస్టాఫీసు.. ఇలా ఎక్కడ ఖాతా తెరిచినా మీ పేరిట దేశవ్యాప్తంగా ఒకే ఒక్క పీపీఎఫ్ ఖాతా ఉండాలి. కానీ, చాలా మంది ఎక్కువ లాభాలు పొందవచ్చనే అపోహతో వేర్వేరు చోట్ల రెండు ఖాతాలు తెరిచి ఇబ్బందుల్లో పడుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జేబుకు భారీ చిల్లు

పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలుంటుంది. ఈ లిమిట్‌ను దాటి ఇన్వెస్ట్ చేయాలనే ప్లాన్‌తో కొందరు రెండో ఖాతాను తెరుస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆదాయపు పన్ను శాఖ లేదా బ్యాంక్ అధికారులు మీ రెండు ఖాతాలను గుర్తించిన వెంటనే, మీ రెండో ఖాతాను చెల్లనిదిగా ప్రకటిస్తారు. దీనివల్ల మీ రెండో ఖాతాలో జమ చేసిన డబ్బుపై మీకు పైసా వడ్డీ కూడా లభించదు. అంతేకాకుండా మెచ్యూరిటీ సమయంలో ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భారీగా పేపర్ వర్క్ చేయాల్సి వస్తుంది.

పొరపాటు జరిగితే డబ్బును కాపాడుకునే మార్గం

కొన్నిసార్లు ఉద్యోగాలు మారి వేరే నగరాలకు వెళ్లినప్పుడు లేదా పాత అకౌంట్ వివరాలు మర్చిపోయినప్పుడు తెలియక రెండో అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీనిని నేరంగా పరిగణించదు, కేవలం ఒక పొరపాటుగా మాత్రమే చూస్తుంది. దీని నుంచి బయటపడటానికి మీరు వెంటనే మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలి. మీ అభ్యర్థన మేరకు, అధికారులు మీ మొదటి అకౌంట్‌ను మెయిన్ అకౌంట్‌గా ఉంచి, మీ రెండో అకౌంట్‌ను క్లోజ్ చేస్తారు. అలాగే, ఆ రెండో అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తాన్ని మీ మొదటి అకౌంట్‌లోకి బదిలీ చేస్తారు. ఈ తప్పు ఎప్పుడైనా బయటపడటం ఖాయం కాబట్టి, ముందే సరిచేసుకోవడం మంచిది.

మైనర్ పిల్లల అకౌంట్లపై ట్యాక్స్ రూల్స్ ఇవే

చాలా మంది తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరు మీద కూడా పీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. చట్టప్రకారం పిల్లల పేరిట అకౌంట్ తెరవడం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. కానీ, ఇక్కడే ఒక టెక్నికల్ ట్విస్ట్ ఉంది. గార్డియన్ (తల్లి లేదా తండ్రి) తన సొంత అకౌంట్, పిల్లల అకౌంట్.. రెండింటినీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. పిల్లల పేరిట అకౌంట్ ఓపెన్ చేసినంత మాత్రాన మీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్ రూ.3 లక్షలకు పెరగదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా ఎల్లప్పుడూ వ్యక్తిగత పేరు మీదే ఉంటుంది, దీనిని ఎవరితోనూ కలిపి జాయింట్ అకౌంట్‌గా తెరవడానికి వీల్లేదు.

ఖాతా మార్చడమే ఉత్తమమైన పరిష్కారం

మీరు ఒకవేళ వేరే ఊరికి షిఫ్ట్ అయినా లేదా ప్రస్తుతం ఉన్న బ్యాంక్ సర్వీసులు నచ్చకపోయినా.. పొరపాటున కూడా కొత్త పీపీఎఫ్ అకౌంట్ తెరవకండి. దానికి బదులుగా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పాత పీపీఎఫ్ ఖాతాను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు లేదా పోస్ట్ ఆఫీసుకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుత డిజిటల్ యుగంలో దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు ఆన్‌లైన్ పీపీఎఫ్ ట్రాన్స్‌ఫర్, మేనేజ్‌మెంట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనివల్ల ఎక్కడికి వెళ్లినా మీ పాత ఖాతానే ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story