Pulses : పప్పుధాన్యాల కొరత ముప్పు.. బహిరంగ మార్కెట్లో విక్రయాలు నిలిపివేయనున్న ప్రభుత్వం
విక్రయాలు నిలిపివేయనున్న ప్రభుత్వం

Pulses : ఖరీఫ్ పంట ఉత్పత్తిపై అల్ నినో ప్రభావం పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో భారత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. రాబోయే నెలల్లో దేశంలో పప్పుధాన్యాల కొరత ఏర్పడకుండా, సామాన్యులకు తగినంత స్టాక్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వల విక్రయాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాలని వ్యవసాయ రంగాన్ని కోరింది. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద సేకరించిన పప్పుధాన్యాల నిల్వలను బహిరంగ మార్కెట్లో అమ్మడం కొద్దిరోజులు నిలిపివేయాలని ప్రతిపాదించింది.
నిబంధనల సడలింపు, పప్పుధాన్యాల నిల్వల రక్షణ
ధరల మద్దతు పథకం నిబంధనల ప్రకారం.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తొమ్మిది నెలల లోపు మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, 2025-26 సీజన్‌లో కొనుగోలు చేసిన కందిపప్పు, శనగ రకాలకు ఈ 9 నెలల విక్రయ నిబంధన నుంచి సడలింపు ఇవ్వాలని కోరింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో పంట దిగుబడిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ స్టాక్‌ను భద్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ బఫర్ స్టాక్ అంచనాలు, నిర్వహణ
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద దాదాపు 4 మిలియన్ టన్నుల పప్పుధాన్యాల బఫర్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇందులో ముఖ్యంగా శనగల నిల్వలు దాదాపు 2 మిలియన్ టన్లు ఉండగా, కందులు/కందిపప్పు నిల్వలు 0.7 నుంచి 0.8 మిలియన్ టన్ల వరకు ఉన్నాయి. నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ సంస్థల వద్ద తగినంత స్టాక్ ఉంచడం వల్ల, అల్ నినో వల్ల పంట నష్టం జరిగినా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో PSS కింద కొనుగోలు చేసిన నిల్వల నుంచి 0.3 మిలియన్ టన్ల కందులు, 0.5 మిలియన్ టన్ల శనగలు, 50,000 టన్ల మినుములను ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కిందకు బదిలీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.
ఆలస్యమైన వర్షాలు – ఖరీఫ్ సాగుపై పడిన ప్రభావం
జూన్ నెలలో వర్షపాతం మందగించడం వల్ల ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. జులై నాటికి దేశంలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 6.92 మిలియన్ హెక్టార్లుగా నమోదు కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 15 శాతం తక్కువగా ఉంది. ముఖ్యంగా మధ్య భారతంలో జూన్ చివరి వరకు సరైన వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణం. సెప్టెంబర్ నాటికి అల్ నినో ప్రభావం మరింత ఎక్కువైతే రాబోయే రబీ పంటలపై కూడా ఆ ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ పథకాలకు నిరంతర సరఫరా హామీ
ప్రభుత్వం పప్పుధాన్యాల విక్రయాలను నియంత్రించడం ద్వారా మార్కెట్‌లో అకస్మాత్తుగా ధరలు పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ వ్యూహాత్మక నిల్వలను బహిరంగ విక్రయాల కంటే, పిఎం-పోషణ్, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనిచ్చి సరఫరా చేయనున్నారు. దీనివల్ల పేదలకు ఇబ్బంది కలగకుండా ఉంచడంతో పాటు, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి లాభపడాలనుకునే వ్యాపారులకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

