అంబానీ మిత్రుడి కంపెనీపై అమెరికా ఆంక్షలు

Putin India Visit : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వస్తున్నారు. ఆయనతో పాటు రష్యా మంత్రులు, పలువురు వ్యాపారవేత్తలు కూడా వస్తున్నారు. వీరిలో ముఖ్యులు ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన రోస్‌నెఫ్ట్ కంపెనీ హెడ్ ఇగోర్ సెచిన్ కూడా ఉన్నారు. రోస్‌నెఫ్ట్ అనేది రష్యాలో అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రోస్‌నెఫ్ట్ నుంచి చమురును భారీగా కొనుగోలు చేసి రిఫైన్ చేసి, ఐరోపాకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోస్‌నెఫ్ట్‌పై ఆంక్షలు విధించడంతో, ఆ కంపెనీతో సహా రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం రిలయన్స్‌కు, ఇతర భారతీయ రిఫైనరీలకు కొంత ఇబ్బందిగా మారింది.

రష్యాపై అమెరికా ఆంక్షలు కఠినతరం కావడంతో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాల్సి వచ్చింది. కొన్ని వారాల క్రితం వరకు, భారతదేశం కొనుగోలు చేస్తున్న రాయితీ రష్యా ముడి చమురులో దాదాపు సగం వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే. రిలయన్స్, పశ్చిమ గుజరాత్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది. ఇది రోస్‌నెఫ్ట్‌తో 10 సంవత్సరాల పాటు రోజుకు 5,00,000 బీపీడీ కొనుగోలుకు 2024లో ఒప్పందం చేసుకుంది. అయితే ట్రంప్ విధించిన 25 శాతం అదనపు టారిఫ్, రోస్‌నెఫ్ట్‌పై పూర్తి నిషేధం వల్ల ఈ డీల్ అమలు చేయడం భారత్‌కు సవాలుగా మారింది. ఈ సంక్షోభం కారణంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గడంతో, చమురు కోసం భారత్ మళ్లీ అమెరికా, మిడిల్ ఈస్ట్ వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం రష్యా, భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. అమెరికా ఆంక్షల కారణంగా తమ అతిపెద్ద కస్టమర్ అయిన భారతదేశాన్ని కోల్పోవాలని రష్యా కోరుకోవడం లేదు. అందుకే రోస్‌నెఫ్ట్ అధికారులు కూడా పుతిన్‌తో కలిసి భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆంక్షల ఒత్తిడిలో కొందరు భారతీయ రిఫైనరీలు దిగుమతి నిలిపివేసిన నేపథ్యంలో, భారత్ మళ్లీ చమురు కొనుగోలును కొనసాగించాలని మాస్కో ఆశిస్తోంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లపై కొత్త పరిష్కార మార్గాలు లేదా డీల్స్ కుదిరే అవకాశంపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story