పుతిన్ పర్యటనతో బంధం ఎంత బలపడుతుంది?

Putins India Visit: భారత్, రష్యాల మధ్య సంబంధాలు దశాబ్దాలుగా అంటే దాదాపు 78 సంవత్సరాలుగా రాజకీయంగా, వాణిజ్యపరంగా బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల మధ్య రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఇరు దేశాలకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి దిగుమతుల కారణంగా ఏర్పడిన వాణిజ్య లోటును తగ్గించుకోవడంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించింది.

ఆర్థిక, రక్షణ రంగాల్లో కీలకం

పుతిన్ పెద్ద వ్యాపారవేత్తల బృందంతో కలిసి వచ్చారు. ఈ పర్యటన ద్వారా రష్యాకు భారతీయ ఎగుమతులను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనివల్ల భారతీయ వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. రక్షణ రంగంలో కూడా పురోగతి కనిపించింది. భారత్ రష్యా నుంచి అదనంగా 23 S-400 రెజిమెంట్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం రూ.18,000–రూ.24,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో 50% టెక్నాలజీ బదిలీ అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే, Su-57 ఐదవ తరం యుద్ధ విమానాల కొనుగోలుపై, భారత్-రష్యా ఉమ్మడి తయారీపై కూడా చర్చలు జరగనున్నాయి.

రూ.100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం

రెండు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2021లో కేవలం $13 బిలియన్లుగా ఉన్న వాణిజ్యం, 2024–25 నాటికి దాదాపు $69 బిలియన్లకు పెరిగింది. అయితే, ఈ పెరుగుదల ఎక్కువగా భారత్ రష్యా నుంచి చేసుకుంటున్న ఎనర్జీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెక్స్‌టైల్స్, ఆహార పదార్థాల ఎగుమతులను పెంచడం ద్వారా వాణిజ్యంలో సమతుల్యత తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రష్యాలో పారిశ్రామిక, వినియోగదారు ఉత్పత్తులకు ఉన్న భారీ డిమాండ్‌ను భారతీయ వ్యాపారాలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story