PVR INOX: ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుతం ఒక కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమా థియేటర్లలో నగదు తీసుకోవడానికి నిరాకరించి, కేవలం డిజిటల్ లేదా యూపీఐ చెల్లింపులను మాత్రమే అంగీకరించే క్యాష్‌లెస్ పాలసీని అనుసరిస్తుండటంపై పెద్ద దుమారం రేగింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఉత్కర్ష్ దవే అనే లాయర్ పీవీఆర్ ఐనాక్స్ సంస్థకు ఏకంగా లీగల్ నోటీసు పంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని పెలేడియం మాల్‌లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ సినిమాకు వెళ్లిన సమయంలో ఎదురైన అనుభవమే ఈ లీగల్ నోటీసుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

థియేటర్‌లో కస్టమర్‌కు ఎదురైన అనుభవం

అహ్మదాబాద్‌కు చెందిన లాయర్ ఉత్కర్ష్ దవే ఇటీవల పెలేడియం మాల్‌లోని పీవీఆర్ ఐనాక్స్ సినిమా కాంప్లెక్స్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా టికెట్లు, ఫుడ్ కౌంటర్ వద్ద తినుబండారాలు కొనుగోలు చేసే సమయంలో ఆయన క్యాష్ రూపంలో డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించారు. అయితే కౌంటర్‌లో ఉన్న సిబ్బంది క్యాష్ తీసుకోవడానికి స్పష్టంగా నిరాకరించారు. తమ వద్ద కేవలం యూపీఐ ద్వారా మాత్రమే పేమెంట్స్ తీసుకుంటామని, క్యాష్ చెల్లించే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేసిన ఆ లాయర్, ఈ నిబంధనపై తీవ్రంగా స్పందిస్తూ సంస్థ తీరును ప్రశ్నించారు.

లీగల్ నోటీసులోని ముఖ్యమైన ప్రశ్నలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934లోని సెక్షన్ 26(1) ప్రకారం ఆర్బీఐ జారీ చేసే బ్యాంకు నోట్లు అన్నీ కూడా చట్టబద్ధమైన లీగల్ టెండర్ అని నోటీసులో పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి క్యాష్ తీసుకోవడానికి పూర్తిగా నిరాకరించడం చట్టపరమైన పారదర్శకతను ప్రశ్నించేలా ఉందని లాయర్ వాదించారు. అలాగే, సినిమా హాల్ లోపలికి వచ్చే కస్టమర్లకు ఈ క్యాష్‌లెస్ ఓన్లీ పాలసీ గురించి ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్, యూపీఐ యాప్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సామాన్యులు లేదా వృద్ధులు వస్తే వారి పరిస్థితి ఏంటని, క్యాష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి సర్వీసులు నిరాకరించవచ్చా అని లాయర్ నిలదీశారు.

వ్యాపార సంస్థల నిబంధనలు, ఏడు రోజుల డెడ్‌లైన్

మరోవైపు ప్రైవేట్ వ్యాపార సంస్థలు తమ సేవలందించే నిబంధనలను నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అలాంటి ప్రత్యేక పాలసీలు ఏవైనా ఉంటే వాటిని కస్టమర్లకు ముందే స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత సంస్థలపై ఉంటుందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం స్పందించడానికి ఏడు రోజుల గడువును ఆ లాయర్ విధించారు. నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాచారం ఇవ్వకపోతే కన్స్యూమర్ కమిషన్, సంబంధిత అధికారిక వేదికలను ఆశ్రయించి చట్టపరమైన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story