టాటాకు భారీ డీల్!

Rafale Fighter Jet : ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటైన రఫేల్ ఫైటర్ జెట్ ప్రధాన భాగం, ఫ్యూసలాజ్, ఇకపై భారతదేశంలోనే తయారవనుంది. ఫ్రాన్స్‌కు చెందిన డాస్సో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది. విమానం ప్రధాన భాగమైన ఫ్యూసలాజ్‌ను తయారు చేయడానికి ఈ ఒప్పందాలు జరిగాయి. టాటా కంపెనీ నాలుగు ఉత్పత్తి బదిలీ ఒప్పందాలపై సంతకం చేసింది. ముఖ్యంగా రఫేల్ ఫ్యూసలాజ్‌లను ఇప్పటివరకు ఫ్రాన్స్ వెలుపల ఏ ఇతర దేశంలోనూ తయారు చేయలేదు. ఈ విషయంలో భారతదేశం కొత్త చరిత్రను సృష్టించనుంది.

ఫ్యూసలాజ్ అంటే ఏమిటి?

మనిషికి అస్థిపంజరం (skeleton) ఎలాగో విమానాలకు ఫ్యూసలాజ్ అలాగే. ఇది విమానం బాహ్య కవచం (outer shell), విమానం అన్ని భాగాలను కలుపుతుంది. విమానం ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుందనే దాని ఆధారంగా ఫ్యూసలాజ్ రూపురేఖలు తయారవుతాయి. ఇది విమానానికి నిర్మాణ బలాన్ని అందిస్తుంది. ఇంజిన్‌లు, రెక్కలు, ల్యాండింగ్ గేర్, ఇతర వ్యవస్థలను కనెక్ట్ చేస్తుంది.

హైదరాబాద్‌లో ఫ్యూసలాజ్ తయారీ యూనిట్

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ హైదరాబాద్‌లో తయారీ యూనిట్లను స్థాపించనుంది. ఈ యూనిట్లలో ఫ్యూసలాజ్ వివిధ భాగాలను తయారు చేస్తారు. హైదరాబాద్, భారత రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఈ యూనిట్ ఇక్కడ స్థాపించడం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2027-28 నాటికి మొదటి ఫ్యూసలాజ్ భాగం ఈ యూనిట్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ యూనిట్‌లో నెలకు రెండు ఫ్యూసలాజ్‌లను తయారు చేయగల సామర్థ్యం ఉందని చెబుతున్నారు.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ రఫేల్ ఫ్యూసలాజ్‌లను తయారు చేయడం డాస్సో ఏవియేషన్ కంపెనీ వరల్డ్ సప్లై చైన్ లో ఒక భాగంగా మారుతుంది. రఫేల్ తయారీలో భాగంగా డాస్సో తన సప్లై చైన్ ను భారతదేశంలో విస్తరించినట్లు అవుతుంది. ఫ్రాన్స్ వెలుపల భారతదేశంలో మాత్రమే ఫ్యూసలాజ్‌లు తయారు చేయబడుతున్నందున ఇది చాలా ముఖ్యమైనది. డాస్సో ఏవియేషన్ సంస్థ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ (Eric Trappier) మాట్లాడుతూ.. భారతదేశంలో తయారు చేయబడే ఫ్యూసలాజ్‌లు కంప్లీట్ క్వాలిటీ ప్రమాణాలను పాటిస్తాయని పేర్కొన్నారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఒక పెద్ద ప్రోత్సాహాన్నిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story