Railway stocks : బడ్జెట్ రాకముందే పండగ తెచ్చిన రైల్వే షేర్లు..ఇన్వెస్టర్ల అకౌంట్లో నోట్ల వర్షం
ఇన్వెస్టర్ల అకౌంట్లో నోట్ల వర్షం

Railway stocks : స్టాక్ మార్కెట్‌లో ఈరోజు (డిసెంబర్ 26, 2025) రైల్వే షేర్లు ఉరుకులు పెడుతున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో ఎక్కడ చూసినా రైల్వే రంగ ప్రభుత్వ రంగ సంస్థల పేర్లే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా IRFC, RVNL షేర్లు ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర బడ్జెట్ దగ్గరపడుతుండటం, మరోవైపు రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రావడంతో ఈ స్టాక్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది.
నేటి ట్రేడింగ్‌లో రైల్వే స్టాక్స్ ఏ రేంజ్‌లో పెరిగాయంటే..రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(RVNL) షేరు ఏకంగా 12 శాతానికి పైగా ఎగబాకి రూ. 388 స్థాయికి చేరుకుంది. మరో దిగ్గజ సంస్థ ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పోరేషన్(IRFC) కూడా వెనక్కి తగ్గకుండా 9 శాతం వృద్ధితో రూ. 132 వద్ద ట్రేడ్ అవుతోంది. వీటితో పాటు IRCTC, RailTel, IRCON వంటి షేర్లు కూడా 3 నుంచి 8 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. 2025లో ఇప్పటివరకు కాస్త స్తబ్దుగా ఉన్న ఈ షేర్లు, ఏడాది చివరలో అద్భుతమైన 'రిలీఫ్ ర్యాలీ'ని చూపిస్తున్నాయి.
ఈ అకస్మాత్తు పెరుగుదలకు ప్రధాన కారణాలివే
టికెట్ ధరల పెంపు: రైల్వే శాఖ నేటి (డిసెంబర్ 26) నుంచే పెంచిన ప్రయాణ ఛార్జీలను అమలు చేస్తోంది. దీనివల్ల రైల్వేకు సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇది రైల్వే రంగ కంపెనీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో పెరిగింది.
బడ్జెట్ ఆశలు: ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో రైల్వే రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే భద్రత (Kavach System), కొత్త వందే భారత్ రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణ కోసం దాదాపు రూ.3లక్షల కోట్ల వరకు భారీ ప్యాకేజీ ఉంటుందని అంచనా.
బలమైన ఆర్డర్ బుక్: RVNL వంటి సంస్థలకు ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆర్డర్లు ఉన్నాయి. తాజాగా ఈశాన్య రైల్వే నుంచి కీలకమైన ప్రాజెక్టులు దక్కడం కూడా కలిసి వచ్చింది.
వాల్యూషన్ ఆకర్షణ: 2025 ప్రారంభం నుంచి ఈ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఇప్పుడు ఇవి సరసమైన ధరల వద్ద లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ర్యాలీ కేవలం స్వల్పకాలికమే కాకుండా.. బడ్జెట్ వరకు కొనసాగే అవకాశం ఉంది. IRFC వంటి స్టాక్స్‌కు రాబోయే రోజుల్లో రూ.145 - రూ.158 టార్గెట్ ధరలు కూడా ఉండవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే గతంలో ఈ షేర్లు 20-30 శాతం నష్టాలను కూడా చూపించినందున, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

