Indian Railways : ఏజెంట్లకు షాక్.. మోసాలకు చెక్ పెట్టే విధంగా రైల్వే కొత్త రూల్
రైల్వే కొత్త రూల్

Indian Railways : భారతీయ రైల్వే.. ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తూ, తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభం అయిన మొదటి 30 నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికుల కోసం మాత్రమే కేటాయింపులు జరుగుతాయి. ఈ సమయంలో ఏ అధీకృత ఏజెంట్ లేదా థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌కు టికెట్ బుక్ చేసుకునేందుకు పర్మీషన్ ఉండదు. టికెట్ బుకింగ్‌లో పారదర్శకతను పెంచడానికి, ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
ఏజెంట్ల ఆగడాలకు చెక్!
ఇప్పటివరకు తత్కాల్ టికెట్ బుకింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే అన్ని టికెట్లు బుక్ అయిపోయేవి. ఇందులో ఏజెంట్లు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసుకోవడమే ప్రధాన కారణం. దీంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకక, ఎక్కువ డబ్బులు చెల్లించి ఏజెంట్ల వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చేది. రైల్వే తీసుకున్న ఈ కొత్త నిబంధన వల్ల ఇప్పుడు సాధారణ ప్రజలకు ప్రాధాన్యత లభిస్తుంది. టికెట్ బుక్ చేసుకునేందుకు వారికి సరైన అవకాశం లభిస్తుంది.
రైల్వే కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
రైల్వే అధికారులు వివరించిన దాని ప్రకారం.. ఈ కొత్త సిస్టమ్ కింద ఉదయం 10 గంటలకు ఏసీ కోటా , 11 గంటలకు స్లీపర్ కోటా తత్కాల్ బుకింగ్ ప్రారంభం అయినప్పుడు, మొదటి 30 నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సమయం దాటిన తర్వాత మాత్రమే ఏజెంట్లు లేదా ఇతర బుకింగ్ సర్వీస్ ప్రొవైడర్లు టికెట్లను బుక్ చేసుకోగలరు.
ఏఐ చాట్‌బాట్ ద్వారా టికెట్ బుకింగ్‌పై నిఘా
టికెట్ బుకింగ్ ప్రక్రియలో భద్రతను పెంచడానికి రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని లేదా 'బాట్'ల ద్వారా జరిగే బుకింగ్‌లను వెంటనే గుర్తించి, వాటిపై చర్య తీసుకుంటుంది.
ఈ చర్య రైల్వే కస్టమర్-కేంద్రీకృత విధానాల్లో భాగం. ఇది బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడమే కాకుండా.. ఏజెంట్ల ద్వారా జరిగే టికెట్ల బ్లాకింగ్, అక్రమ వసూళ్లకు కూడా అడ్డుకట్ట వేస్తుంది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. సాధారణ ప్రజలకు టికెట్ బుకింగ్‌లో సమాన అవకాశం కల్పించే దిశగా ఇది ఒక మంచి ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గి, ఏజెంట్ల బాధలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.
