Mehli Mistry : టాటా గ్రూప్ దిగ్గజం దివంగత రతన్ టాటాకు అత్యంత నమ్మకస్తుడు, మైత్రి కలిగిన వ్యాపార భాగస్వామి మెహ్లా మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రతన్ టాటాకు చెందిన వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యామిలీ ఆఫీస్ ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామా జూలై 1 నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కంపెనీ బోర్డులో చేరిన మెహ్లా మిస్త్రీ, ఊహించని విధంగా తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ జూన్ 30న మెహ్లా మిస్త్రీ కంపెనీ బోర్డుకు ఒక అధికారిక లేఖను పంపారు. ప్రస్తుతం తాను ఇతర ముఖ్యమైన వ్యాపార బాధ్యతలు, పనుల్లో చాలా బిజీగా ఉన్నానని, అందుకే ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 1 నుండే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. అయితే, కేవలం పని ఒత్తిడి వల్లే ఆయన తప్పుకున్నారా లేక టాటా గ్రూప్‌లో జరుగుతున్న అంతర్గత మార్పుల వల్లనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కార్పొరేట్ విశ్లేషకుల ప్రకారం.. మెహ్లా మిస్త్రీ టాటా గ్రూప్ సంస్థల నుంచి తప్పుకోవడం ఇది మొదటిసారేం కాదు. దీనికి ముందు గతేడాది నవంబర్‌లో ఆయనను ప్రతిష్టాత్మక టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి కూడా తొలగించారు. టాటా సన్స్‌లో అత్యధిక వాటాలు కలిగి ఉండి, మొత్తం టాటా గ్రూప్‌ను నియంత్రించే అతిపెద్ద సంస్థే ఈ టాటా ట్రస్ట్స్. దీని నుంచి తప్పుకున్న కొన్ని నెలలకే ఇప్పుడు ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ నుంచి కూడా ఆయన అవుట్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కేవలం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ బోర్డులో మాత్రమే కొనసాగుతున్నారు. దీనిని బట్టి ఆయన క్రమంగా టాటా గ్రూప్‌నకు దూరమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

రతన్ టాటా తన వ్యక్తిగత పెట్టుబడుల కోసం మార్చి 2009లో ఈ ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్‎ను స్థాపించారు. భారతదేశంలోని సరికొత్త స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దేశంలోనే అత్యంత పాపులర్ అయిన పేటీఎం, ఓలా, బ్లూస్టోన్ వంటి ఎన్నో విజయవంతమైన స్టార్టప్ కంపెనీలలో ఈ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి కన్సల్టెన్సీ సేవలు, వివిధ కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్ల ద్వారా ఆదాయం లభిస్తుంది. లభ్యమవుతున్న ఆర్థిక లెక్కల ప్రకారం, మార్చి 2023 నాటికి ఈ కంపెనీ మొత్తం ఆదాయం సుమారు రూ.36 కోట్లుగా ఉండగా, అందులో సగానికి పైగా ఆదాయం కేవలం డివిడెండ్ల రూపంలోనే రావడం విశేషం.

ఒకప్పుడు రతన్ టాటా, ఆయన నమ్మకస్థుడైన ఆర్‌కే కృష్ణ కుమార్ ఈ కంపెనీలో ప్రధాన వాటాదారులుగా ఉండేవారు. ఆ తర్వాత రతన్ టాటా తన వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌లకు బదిలీ చేశారు. ప్రస్తుతం టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు సింహభాగం అంటే 65.9 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్, కొందరు వ్యక్తిగత షేర్‌హోల్డర్ల వద్ద ఉన్నాయి. మెహ్లా మిస్త్రీ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ బోర్డులో రతన్ టాటా సోదరీమణులు శిరీన్ జెజీభాయ్, డియానా జెజీభాయ్‌లతో పాటు జంషెడ్ పొంచా, సిద్ధార్థ్ శర్మ సభ్యులుగా ఉన్నారు. టాటా గ్రూప్‌లో జరుగుతున్న ఈ మేనేజ్‌మెంట్ మార్పులు భవిష్యత్తు వ్యూహాలలో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story