RBI Fraud Report : ఏడాదిలో ఏకంగా రూ.48,000 కోట్ల బ్యాంకు దోపిడీ.. ఆర్‌బీఐ రిపోర్ట్‌లో బద్దలైన అసలు నిజాలు
ఆర్‌బీఐ రిపోర్ట్‌లో బద్దలైన అసలు నిజాలు

RBI Fraud Report : భారతీయ బ్యాంకింగ్ రంగంలో రోజురోజుకూ పెరుగుతోన్న మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మనం ఎంతో నమ్మకంగా బ్యాంకుల్లో దాచుకునే డబ్బులకు రక్షణ ఉందా లేదా అనే అనుమానాలు కలిగేలా ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. దేశ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఒక ఘోరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. గడిచిన ఒక్క ఆర్థిక ఏడాదిలోనే (2025-26) భారతీయ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ ఏకంగా రూ.48,000 కోట్ల మార్కును దాటేసింది. మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఏకంగా 46 శాతం పెరగడం టెక్, బిజినెస్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మహా దోపిడీ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈ ఏడాది ఆర్‌బీఐ నివేదికలో ఒక వింతైన విషయం వెలుగుచూసింది. బ్యాంకుల్లో జరిగే మోసాల సంఖ్య (కేసులు) గత ఏడాది కంటే సగానికి పైగా తగ్గినప్పటికీ.. దోపిడీకి గురైన డబ్బు విలువ మాత్రం కొండలా పెరిగిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 10,114 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 23,722 గా ఉంది. అంటే చిన్న చిన్న మోసాలు తగ్గి.. ఒకేసారి వందల కోట్లు కొల్లగొట్టే పెద్ద పెద్ద స్కామ్‌లు పెరిగాయన్నమాట. ఇందులో గరిష్టంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకే దొంగలు పెద్ద కన్నం వేశారు. ప్రభుత్వ బ్యాంకుల్లో మోసపోయిన సొమ్ము రూ. 23,617 కోట్ల నుంచి ఏకంగా రూ. 35,709 కోట్లకు పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ నష్టం రూ. 11,399 కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాది బయటపడిన మొత్తం రూ. 48,021 కోట్ల భారీ స్కామ్ మొత్తంలో గత కొన్ని ఏళ్లుగా దాగి ఉన్న 314 పాత కేసులు కూడా ఉన్నాయి. వీటి విలువ మాత్రమే ఏకంగా రూ. 30,199 కోట్లుగా ఉంది. 2023 మార్చి 27 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు తర్వాత.. పాత బ్యాంకు మోసాలపై అధికారులు మళ్లీ లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ అస్సలు నిజాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. సాధారణంగా బ్యాంకుల్లో మోసం జరిగిన వెంటనే విషయం బయటకు రాదని, దర్యాప్తు పూర్తయి ఆర్‌బీఐకి రిపోర్ట్ చేసిన ఏడాదిలోనే ఆ లెక్కలను లెక్కిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఈ రూ.48,000 కోట్ల దోపిడీలో అత్యధిక భాగం బ్యాంక్ లోన్లు రూపంలోనే జరిగింది. కేవలం లోన్ ఫ్రాడ్స్ ద్వారానే 8,640 కేసుల్లో ఏకంగా రూ.40,774 కోట్లు స్వాహా అయిపోయాయి. గత ఏడాది ఈ నష్టం రూ.30,367 కోట్లుగా ఉండేది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు బ్యాంకు అధికారుల కళ్లు గప్పి.. నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల రూపాయల లోన్లు తీసుకుని ఐపీ పెట్టేయడం వల్లే ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పెద్ద పెద్ద లోన్ స్కామ్‌లు పెరిగినప్పటికీ.. సామాన్య ప్రజలు వాడే యూపీఐ , క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే డిజిటల్ ఫ్రాడ్స్ మాత్రం ఊహించని విధంగా భారీగా తగ్గిపోవడం ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం. గత ఏడాది కార్డు మోసాల వల్ల రూ.517 కోట్లు లూటీ అవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య కేవలం రూ. 29 కోట్లకు పడిపోయింది. అలాగే కేసుల సంఖ్య కూడా 13,332 నుంచి ఏకంగా 293కి తగ్గిపోయింది. ఆర్‌బీఐ తీసుకొచ్చిన కఠినమైన డిజిటల్ భద్రతా నియమాలు, ఓటీపీ వెరిఫికేషన్లు, బ్యాంకుల నిరంతర నిఘా వల్లే సైబర్ నేరగాళ్ల ఆటలు సామాన్యుల దగ్గర సాగలేదని ఆర్‌బీఐ గర్వంగా ప్రకటించింది.
ఆన్‌లైన్ దొంగతనాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ ఇప్పుడు కిల్ స్విచ్ అనే ఒక సరికొత్త రక్షణ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఈ సిస్టమ్ గనక వస్తే.. మీ అకౌంట్ నుండి ఎవరైనా దొంగతనంగా డబ్బులు డ్రా చేస్తున్నారని మీకు అనుమానం రాగానే, జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని రకాల ఆన్‌లైన్ లావాదేవీలను మీ ఫోన్ నుండే వెంటనే పూర్తిగా ఫ్రీజ్ లేదా బ్లాక్ చేసేయొచ్చు. దీంతో పాటు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీని పెంచేందుకు మన దేశంలో మాత్రమే ప్రత్యేకంగా .bank.in అనే అత్యంత సురక్షితమైన ఇంటర్నెట్ డొమైన్‌ను ఆర్‌బీఐ ప్రారంభించింది. ఈ తరహా వినూత్న భద్రతా అడుగు వేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.

