RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామాన్య బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలే పరమావధిగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి SMS చార్జీల పేరిట రూ.15 నుంచి రూ.18 వరకు అకౌంట్ల నుండి కట్ చేస్తుంటాయి. అయితే, తాజాగా ఆర్‌బీఐ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.. ఇకపై బ్యాంకులు పంపే నిబంధనల అవగాహన, ప్రొమోషనల్ మెసేజ్ లకు ఖాతాదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకూడదు. ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది సామాన్య ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.

బ్యాంకులకు రూ.300 కోట్ల భారీ నష్టం

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల వార్షిక ఫీజు ఆదాయం భారీగా పడిపోనుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంచనాల ప్రకారం.. దేశంలోని పెద్ద బ్యాంకుల వార్షిక ఆదాయంలో దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.360 కోట్ల వరకు గండి పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 5 కోట్ల మంది పెయిడ్ కస్టమర్లు ఉన్న ఒక పెద్ద బ్యాంకుకు ఈ ఎస్‌ఎమ్‌ఎస్ రుసుములు నిలిచిపోవడం వల్ల పెద్ద మొత్తంలో నష్టం వస్తుంది. అయితే, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకులు అకౌంట్ మెయింటెనెన్స్ చార్జీలు, కనీస బ్యాలెన్స్ ఫైన్లు లేదా ఇతర సేవా రుసుములను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.500 లోపు ట్రాన్సాక్షన్లకు నో మెసేజ్

కొత్త నిబంధనల ప్రకారం.. రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువైన చిన్న చిన్న లావాదేవీలకు ఖాతాదారులకు ఎస్‌ఎమ్‌ఎస్ అలర్టులు పంపడం ఇకపై తప్పనిసరి కాదు. దీనిని ఆర్‌బీఐ ఆప్షనల్ చేసింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి పెద్ద ప్రైవేట్ బ్యాంకులు మాత్రం చిన్న లావాదేవీలకు కూడా ఎస్‌ఎమ్‌ఎస్ అలర్టులను ప్రస్తుతానికి కొనసాగించాలని భావిస్తున్నాయి. తక్షణ సందేశాల వల్ల ఖాతాదారులకు భద్రతా భావం కలగడమే కాకుండా, సైబర్ వంచనలు, బ్యాంకింగ్ మోసాలను ముందే అరికట్టవచ్చని ఈ బ్యాంకులు నమ్ముతున్నాయి.

వాట్సాప్, మొబైల్ నోటిఫికేషన్ల వైపు బ్యాంకుల చూపు

ఈ ఆర్‌బీఐ రూల్ కేవలం బ్యాంకులపైనే కాకుండా దేశంలోని టెలికాం కంపెనీల బిజినెస్‌పై కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం దేశంలో నెలకు సుమారు 60 నుంచి 80 బిలియన్ల కమర్షియల్ ఎస్‌ఎమ్‌ఎస్‌లు వెళ్తుంటాయి, ఇందులో అత్యధిక భాగం బ్యాంకులకు సంబంధించినవే. చిన్న లావాదేవీలకు బ్యాంకులు మెసేజ్‌లు పంపడం తగ్గిస్తే టెలికాం కంపెనీల ఆదాయం పడిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు, గూగుల్ ఆర్‌సీఎస్, ఇన్-యాప్ అలర్టులు, మొబైల్ పుష్ నోటిఫికేషన్ల వంటి ఉచిత డిజిటల్ మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story