Loan EMI : ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు షాక్... కస్టమర్లకు భరోసానిచ్చిన విదేశీ బ్యాంకులు
కస్టమర్లకు భరోసానిచ్చిన విదేశీ బ్యాంకులు

Loan EMI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ తగ్గించిన రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించడంలో దేశీయ బ్యాంకుల కంటే విదేశీ బ్యాంకులే ముందుంజలో నిలిచాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే విదేశీ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి, తమ కస్టమర్ల లోన్ ఈఎంఐ భారాన్ని తగ్గించాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా మంత్లీ బులెటిన్‌లో వెల్లడించింది. ఫిబ్రవరి 2025 నుంచి మే 2026 మధ్య కాలంలో బ్యాంకులు రేట్ల కోతను కస్టమర్లకు ఏ విధంగా బదిలీ చేశాయో ఈ నివేదిక స్పష్టం చేసింది.
రుణాలపై వడ్డీ తగ్గించడంలో విదేశీ బ్యాంకుల రికార్డు
ఆర్బీఐ నివేదిక ప్రకారం, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ (EBLR), ఎంసిఎల్ఆర్ (MCLR) ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంలో విదేశీ బ్యాంకులు అగ్రస్థానంలో ఉన్నాయి. రూపాయిలో తీసుకున్న కొత్త రుణాలపై విదేశీ బ్యాంకులు సగటు వడ్డీ రేటును ఏకంగా 1.24 శాతం తగ్గించాయి. వీటికి భిన్నంగా ప్రైవేట్ బ్యాంకులు 1.08 శాతం, ప్రభుత్వ (పబ్లిక్ సెక్టార్) బ్యాంకులు కేవలం 0.66 శాతం మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇక పాత రుణాల విషయానికొస్తే.. విదేశీ బ్యాంకులు వడ్డీ రేట్లను 1.20 శాతం మేర తగ్గించగా, ప్రైవేట్ బ్యాంకులు 0.98 శాతం, ప్రభుత్వ బ్యాంకులు 0.81 శాతం తగ్గించాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీల్లోనూ కోత
రుణాలపైనే కాకుండా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గించడంలోనూ విదేశీ బ్యాంకులే ముందున్నాయి. కొత్తగా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై విదేశీ బ్యాంకులు సగటు వడ్డీని 0.91 శాతం తగ్గించగా, ప్రైవేట్ బ్యాంకులు 0.74 శాతం, ప్రభుత్వ బ్యాంకులు 0.73 శాతం మేర కోత విధించాయి. అలాగే ఉన్న డిపాజిట్లపై విదేశీ బ్యాంకులు 0.90 శాతం వడ్డీని తగ్గించగా, ప్రైవేట్ బ్యాంకులు 0.46 శాతం, ప్రభుత్వ బ్యాంకులు 0.53 శాతం మాత్రమే రేట్లను సవరించాయి.
ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన తీరు
ఆర్బీఐ గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించింది. గత ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, డిసెంబర్ ద్రవ్య పరపతి సమీక్షల్లో 0.25 శాతం చొప్పున, జూన్ సమీక్షలో 0.50 శాతం మేర రెపో రేటును తగ్గించింది. అయితే ఆగస్టు, అక్టోబర్, ఫిబ్రవరి 2026 నాటి సమీక్ష సమావేశాల్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ ఇచ్చిన ఈ రేట్ల తగ్గింపు అవకాశాన్ని ఉపయోగించుకుని సాధారణ ప్రజలకు లోన్ ఈఎంఐల భారం తగ్గించడంలో విదేశీ బ్యాంకులు అగ్రభాగాన నిలిచాయి.

