RBI Gold Reserves : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఖజానా ప్రస్తుతం పసిడి కాంతులతో మెరిసిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ విలువ ఊహించని రేంజ్‌లో దూసుకుపోయింది. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే ఆర్‌బీఐ బంగారు నిల్వల విలువ ఏకంగా 64 శాతం పెరిగి.. ఇప్పుడు దాదాపు రూ.11 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. దేశ విదేశీ మారక నిల్వలలో కూడా బంగారం వాటా గత రెండేళ్లలో రెట్టింపు కావడం విశేషం.

గడిచిన మార్చి 2026 చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ రూ.9,42,699 కోట్లుగా ఉండేది. అయితే మే 22, 2026 నాటికి ఈ విలువ ఏకంగా రూ.10,98,889 కోట్లకు అంటే సుమారు రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆర్‌బీఐ బంగారానికి దాదాపు రూ.2 లక్షల కోట్ల అదనపు వాల్యూ పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేట్లు ఆకాశాన్ని తాకడం, రూపాయి పతనం కావడమే దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు.

చలామణిలో ఉండే కరెన్సీ నోట్లకు బ్యాకప్‌గా ఉండే ఆర్‌బీఐ ఇష్యూ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న బంగారం విలువ 64.1 శాతం పెరిగి.. రూ.2,36,537.54 కోట్ల నుంచి రూ.3,88,147.13 కోట్లకు చేరింది. అదేవిధంగా బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉన్న బంగారం, గోల్డ్ డిపాజిట్ల విలువ 63.6 శాతం వృద్ధితో రూ.4,31,624.80 కోట్ల నుండి ఏకంగా రూ.7,06,162.36 కోట్లకు పెరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బంగారం విలువ లక్షల కోట్లలో పెరిగినప్పటికీ, భౌతికంగా బంగారం పరిమాణంలో పెద్దగా మార్పు లేదు. మార్చి 31, 2026 నాటికి ఆర్‌బీఐ వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. అంతకుముందు ఏడాదితో (879.58 టన్నులు) పోలిస్తే కేవలం 0.94 టన్నులు మాత్రమే పెరిగింది. నాలుగు నెలల గ్యాప్ తర్వాత జనవరి 2026 లో ఆర్‌బీఐ 0.13 టన్నుల గోల్డ్ కొనగా, ఫిబ్రవరిలో ఎలాంటి కొనుగోళ్లు చేయలేదు. అంటే కేవలం రేట్లు పెరగడం వల్లే ఖజానా విలువ ఈ రేంజ్‌లో పెరిగింది.

భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా గత రెండేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మార్చి 2024లో ఆర్‌బీఐ నికర విదేశీ ఆస్తులలో బంగారం వాటా కేవలం 8.3 శాతంగా ఉండేది. అది మార్చి 2025 నాటికి 12 శాతానికి.. ఇప్పుడు మార్చి 2026 నాటికి ఏకంగా 17.2 శాతానికి పెరిగి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న 880.52 టన్నుల బంగారంలో 312.32 టన్నులు ఇష్యూ డిపార్ట్‌మెంట్ వద్ద, 568.20 టన్నులు బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద భద్రంగా ఉన్నాయి.

గత కొన్ని ఏళ్లుగా ఆర్‌బీఐ తన వద్ద ఉన్న బంగారాన్ని విదేశీ బ్యాంకుల నుంచి భారత్‌కు తీసుకువచ్చే సరికొట్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2025-26 లో విదేశాల నుంచి ఏకంగా 168.06 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇండియాకు సురక్షితంగా తరలించారు. అంతకుముందు 2023-24 లో 107.21 టన్నులు, 2024-25 లో 103.68 టన్నుల బంగారాన్ని దేశానికి తిరిగి తీసుకువచ్చారు. ప్రస్తుతం మొత్తం బంగారంలో 367.73 టన్నులు ఇండియాలోనే ఉండగా.. 200.47 టన్నులు మాత్రమే విదేశాల్లో భద్రపరచబడి ఉంది.

మార్చి 31, 2026 నాటికి భారత మొత్తం విదేశీ మారక నిల్వలు రూపాయిల లెక్కన చూస్తే 14.7 శాతం పెరిగి రూ.65.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇది రూ.57.12 లక్షల కోట్లుగా ఉండేది. అయితే అంతర్జాతీయంగా డాలర్ పరంగా చూస్తే ఈ వృద్ధి కేవలం 3.4 శాతంగానే ఉంది. అంటే డాలర్లలో ఫారెక్స్ నిల్వలు 668.33 బిలియన్ డాలర్ల నుంచి 691.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కాగా మే 22, 2026 నాటికి ఈ నిల్వలు స్వల్పంగా తగ్గి 681.38 బిలియన్ డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story