RBI Governor: టాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. షేర్ మార్కెట్లో లిస్టింగ్ కావడం తప్పనిసరి అన్న గవర్నర్
తప్పనిసరి అన్న గవర్నర్

RBI Governor: భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎన్బీఎఫ్సీ రంగంపై అత్యంత స్పష్టమైన ప్రకటన చేశారు. పబ్లిక్ మనీని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించే ప్రతి పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయి ఉండాలని స్పష్టం చేశారు. టాటా సన్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు గ్రూప్ సంస్థల ద్వారా ఆర్థిక వనరులను సమీకరిస్తాయి కాబట్టి, ఇవి సిస్టమిక్ రిస్క్‌ను సృష్టిస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. అందుకే నిబంధనల ప్రకారం టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం అనివార్యమని ఆయన తేల్చి చెప్పారు.
నమోదు రద్దు దరఖాస్తు తిరస్కరణ
గత నెలలో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్, తమ ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ అర్జీని ఆర్బీఐ తోసిపుచ్చింది. సెప్టెంబర్ 2022లో టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించారు. కంపెనీ తన అప్పులన్నీ తీర్చేసినప్పటికీ, పబ్లిక్ ఫండ్స్‌తో సంబంధం ఉన్నందున ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించలేదు. దీంతో టాటా సన్స్ షేర్లు త్వరలోనే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభించే అవకాశం మరింత బలపడింది.
ఆర్థిక వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలు
ఈ సమావేశంలో భాగంగా దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా ఆర్బీఐ గవర్నర్ కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో సిమెంట్, స్టీల్ విక్రయాలు, క్రెడిట్ గ్రోత్ అలాగే పన్ను వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం కేంద్రీకృత లక్ష్యాల పరిధిలోనే ఉన్నప్పటికీ, ఆహార పదార్థాల ధరలు సవాళ్లు విసురుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రూపాయి విలువను కృత్రిమంగా కాపాడే ప్రయత్నం చేయకుండా, మార్కెట్ ఒడిదుడుకులను మాత్రమే నియంత్రిస్తామని ఆయన స్పష్టం చేశారు.

