డిసెంబర్‌లో మళ్లీ తగ్గనున్న EMI ?

Repo Rate Cut : కొత్తగా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి లేదా ఇప్పటికే ఇల్లు, కారు, పర్సనల్ లోన్ తీసుకుని ఈఎంఐ కడుతున్న వారికి ఇది నిజంగా శుభవార్త కావచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సంవత్సరం చివరిలో రెపో రేటును మరోసారి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ఈఎంఐలు తగ్గే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు రెపో రేటును తగ్గించడానికి అనుకూలంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంకేతాలు ఇచ్చారు.

రెపో రేటు తగ్గింపుపై తుది నిర్ణయం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకుంటామని గవర్నర్ మల్హోత్రా తెలిపారు. ఆయన ఈ ప్రకటన చేసింది సరిగ్గా డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఎంపీసీ సమావేశం జరగడానికి ముందు కావడం విశేషం. అక్టోబర్‌లో జరిగిన సమావేశంలోనే రేట్లను తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చామని మల్హోత్రా గుర్తు చేశారు. కాబట్టి రాబోయే సమావేశంలో ముఖ్యమైన ప్రకటన ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎంపీసీ ఇప్పటికే 100 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను తగ్గించగా, ఆగస్టు, అక్టోబర్‌లలో మాత్రం 5.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.

డిసెంబర్‌లో దాదాపు 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటు కోత ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గింపుకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అదుపులోకి రావడమే. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం.. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 0.25 శాతం రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 1.44 శాతంగా ఉంది.

ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. కేంద్ర బ్యాంక్ మొదటి లక్ష్యం ధరల స్థిరత్వం, రెండవ లక్ష్యం ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం. అందుకే, బ్యాంక్ దూకుడుగా రేట్లను తగ్గించకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రూపాయి విలువ నిరంతరం పడిపోవడంపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. చారిత్రక రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం రూపాయి విలువ దాదాపు మూడు నుంచి మూడున్నర శాతం తగ్గుతుందని ఆయన చెప్పారు. మారకం రేటులో హఠాత్తుగా లేదా వేగంగా మార్పులు వచ్చి ఆర్థిక అస్థిరత ఏర్పడకుండా, రూపాయి విలువ హెచ్చుతగ్గులను నియంత్రణలో ఉంచడమే ఆర్‌బీఐ లక్ష్యమని ఆయన వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story