RBI : బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్‌బీఐ షాక్.. భారీ జరిమానా విధించిన కేంద్ర బ్యాంక్
కేంద్ర బ్యాంక్

RBI : దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన చర్యలు తీసుకుంది. వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను బేఖాతరు చేయడం, కొన్ని రకాల రుణాలపై పరిమితికి మించి వడ్డీ వసూలు చేయడంతో పాటు కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.63.60 లక్షల భారీ జరిమానా విధించింది. దీంతో పాటు నిబంధనలు పాటించని కారణంగా జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కూడా ఆర్‌బీఐ భారీ పెనాల్టీ విధించింది. కేంద్ర బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.
లోన్ కస్టమర్ల జేబులకు చిల్లు
ఈ వివాదం అంతా నేరుగా సాధారణ మధ్యతరగతి లోన్ కస్టమర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఆర్‌బీఐ జరిపిన అంతర్గత దర్యాప్తులో బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన పెద్ద తప్పు వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంక్ కొన్ని లోన్ అకౌంట్లపై నిర్ణీత రేటు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేసినట్లు తేలింది. అంటే కస్టమర్లు తాము తీసుకున్న అప్పుపై చెల్లించాల్సిన సాధారణ ఈఎంఐ లేదా వడ్డీ కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంక్ వారి ఖాతాల నుంచి లాగేసుకుంది. ఇది బ్యాంక్ రూల్స్ కి పూర్తి విరుద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సామాన్యుడు ఎంతో నమ్మకంతో బ్యాంకు నిబంధనలపై సంతకం చేస్తే, బ్యాంక్ ఇలా అదనపు వసూళ్లకు పాల్పడటం బ్యాంకింగ్ వ్యవస్థ పారదర్శకతను దెబ్బతీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేవైసీ రూల్స్ బ్రేక్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా
అదనపు వడ్డీ వసూలు చేయడమే కాకుండా, ఖాతాదారుల కేవైసీ ప్రక్రియ నిర్వహణలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్ల వివరాలను నిర్ణీత గడువులోగా సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీలో అప్‌లోడ్ చేయడం చట్టబద్ధమైన నిబంధన. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేకమంది కస్టమర్ల విషయంలో ఈ డేటాను అప్‌లోడ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇది డిజిటల్ భద్రత, బ్యాంకింగ్ నిబంధనలను కాలరాయడమేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది.
ఆర్‌బీఐ సమగ్ర ఆడిట్..
మార్చి 31, 2025 నాటి ఆర్థిక పరిస్థితిని ప్రాతిపదికగా తీసుకుని ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై సమగ్ర ఆడిట్ నిర్వహించింది. ఆడిట్‌లో లోపాలు బయటపడటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి సమాధానంగా బ్యాంక్ సమర్పించిన లిఖితపూర్వక వివరణ, వ్యక్తిగత విచారణలో వారి అధికారులు వినిపించిన వాదనలతో ఆర్‌బీఐ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో జూన్ 30, 2026 నాటి ఆదేశాల ప్రకారం ఈ రూ.63.60 లక్షల పెనాల్టీని ఖరారు చేశారు.
జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు కూడా తగిలిన సెగ
రిజర్వ్ బ్యాంక్ తన కఠిన చర్యలను కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడాతోనే ఆపలేదు. జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పై కూడా రూ.3.10 లక్షల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మార్చి 31, 2025 నాటి గణాంకాల ప్రకారం చేసిన తనిఖీల్లో ఈ కంపెనీ మోసాలు బయటపడ్డాయి. కస్టమర్ల ఖాతాలకు సంబంధించిన రిస్క్ కేటగిరీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ వ్యవస్థను ఈ కంపెనీ సక్రమంగా అమలు చేయలేకపోయింది. నోటీసుల అనంతరం వారి సమాధానాలను పరిశీలించి, తప్పు రుజువు కావడంతో ఈ ఫైన్ ఖరారు చేశారు.

