దొంగతనం జరిగితే బ్యాంకు ఇచ్చే పరిహారం ఎంతో తెలుసా ?

RBI Locker Rules : ఢిల్లీలో ఇటీవల ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కీర్తి నగర్‌లోని ఒక బ్యాంకు శాఖలో తన లాకర్ నుంచి ఏకంగా 60 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. బ్యాంకు అధికారుల సమక్షంలోనే లాకర్ తెరిచినప్పటికీ, లోపల నగలు లేకపోవడంతో ఆమె షాక్ తింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు బ్యాంకు నిర్లక్ష్యంపై మండిపడింది. అసలు బ్యాంకు లాకర్లలో దొంగతనం జరిగితే మనకు ఎంత నష్టపరిహారం వస్తుంది? ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం.

చాలామంది తమ నగలు బ్యాంకు లాకర్‌లో ఉంటే వంద శాతం సురక్షితం అనుకుంటారు. కానీ, చట్టపరంగా చూస్తే బ్యాంకుకు, మీకు మధ్య ఉండే సంబంధం కేవలం యజమాని-కిరాయిదారు లాంటిది మాత్రమే. అంటే మీరు ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే, ఆ ఇంట్లో మీ సామాన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప ఇంటి యజమానిది కాదు. బ్యాంకు కూడా అదే సూత్రాన్ని పాటిస్తుంది. లాకర్ లోపల మీరు ఏం పెట్టారు, దాని విలువ ఎంత అనేది బ్యాంకుకు తెలియదు, అది బ్యాంకు బాధ్యత కూడా కాదు.

ఒకవేళ బ్యాంకులో దొంగతనం జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా లేదా బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మీ నగలు మాయమైనా.. మీకు వచ్చే నష్టపరిహారానికి ఒక పరిమితి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, మీ లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు మాత్రమే బ్యాంకు నష్టపరిహారంగా చెల్లిస్తుంది. ఉదాహరణకు, మీరు ఏడాదికి 4,000 రూపాయలు అద్దె కడుతుంటే, మీ లాకర్ నుంచి కోటి రూపాయల నగలు పోయినా బ్యాంకు గరిష్టంగా 4 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చే బాధ్యత బ్యాంకుకు ఉండదు.

అయితే ఈ నష్టపరిహారం కూడా బ్యాంకు తప్పు ఉందని నిరూపితమైతేనే వస్తుంది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే బ్యాంకులు బాధ్యత వహించవు. దొంగతనం జరిగినప్పుడు బ్యాంకు సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్ అయిందని లేదా సిబ్బంది చేతివాటం ఉందని నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం చాలా తీవ్రంగా ఉంటే, మీరు వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ పరిస్థితిని బట్టి కోర్టు అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించే అవకాశం ఉంటుంది.

ముందు జాగ్రత్తగా మీ విలువైన ఆభరణాలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా బీమా చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంకు లాకర్ ఆపరేట్ చేసిన ప్రతిసారీ మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్ట్ వస్తుందో లేదో చూసుకోవాలి. సీసీటీవీ ఫుటేజీని 180 రోజుల పాటు భద్రపరచడం బ్యాంకు విధి. కాబట్టి, ఎప్పుడైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story