RBI Master Plan: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్.. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలోనూ మన రూపాయి హవా
ఇక అంతర్జాతీయ వాణిజ్యంలోనూ మన రూపాయి హవా

RBI Master Plan: ప్రపంచ యవనికపై భారతీయ రూపాయి తన సత్తా చాటబోతోంది. కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోనూ చెలామణి అయ్యేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూపాయిని నిలబెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కరెన్సీ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన ఆర్‌బీఐ, రూపాయి విలువే లక్ష్యంగా కొత్త వ్యూహాలను వెల్లడించింది.
భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడంపై ఆర్‌బీఐ తన నిబద్ధతను చాటుకుంది. బుధవారం జరిగిన ఒక సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ మాట్లాడుతూ, రూపాయిని గ్లోబల్ ట్రేడ్, విదేశీ నిల్వల కోసం ఒక ప్రధాన కరెన్సీగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల కరెన్సీ మార్కెట్‌లో మితిమీరిన ఊహాగానాలు, డాలర్ల కృత్రిమ కొరతను నివారించడానికి ఆర్‌బీఐ తీసుకున్న కఠిన చర్యలు కేవలం తాత్కాలికమేనని ఆయన వివరించారు. పరిస్థితులు చక్కబడగానే ఆ నిబంధనలను సడలిస్తామని హామీ ఇచ్చారు.
కరెన్సీ మార్కెట్లో అనిశ్చితిని తగ్గించేందుకు గత నెలలో ఆర్‌బీఐ కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ మార్కెట్లో సట్టా వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. అయితే, తాజాగా ఆ నిబంధనలలో కొన్నింటిని ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంది. నివాసితులు, అనివాసితులు ఐఎన్‌ఆర్ తో కూడిన నాన్-డెలివరీబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను మళ్లీ ఉపయోగించుకోవడానికి అనుమతించింది. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్లకు మన కరెన్సీ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
రూపాయి విలువ పెరగడమా లేక తగ్గడమా అనేది పూర్తిగా డిమాండ్, సరఫరా వంటి మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటుందని రవిశంకర్ స్పష్టం చేశారు. రూపాయి విలువను కృత్రిమంగా పెంచడానికి తాము ప్రయత్నించబోమని, కేవలం మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ ప్రధాన ఉద్దేశం కరెన్సీ మార్కెట్ స్థిరంగా ఉండటమే తప్ప, రూపాయి రేటును నియంత్రించడం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం అత్యవసరమని ఆర్‌బీఐ పేర్కొంది. కోవిడ్-19 వంటి సంక్షోభ సమయంలోనూ మార్కెట్లను స్థిరంగా ఉంచిన అనుభవం తమకు ఉందని, అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించింది. రూపాయి ఇంటర్నేషనలైజేషన్ అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, దీని కోసం విదేశీ వ్యాపారులకు,పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది.

