RBI : సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్.. భారతీయ బ్యాంకుల్లో విదేశీ కరెన్సీ డిపాజిట్లకు భారీ వడ్డీ
భారతీయ బ్యాంకుల్లో విదేశీ కరెన్సీ డిపాజిట్లకు భారీ వడ్డీ

RBI : భారతదేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని వేగవంతం చేయడానికి, దేశీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా డాలర్ రిక్రూట్‌మెంట్‌ను పెంచే వ్యూహంలో భాగంగా.. 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన కొత్త ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) అంటే ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
సెప్టెంబర్ 30, 2026 వరకు తాత్కాలిక మినహాయింపు
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. ఈ సరికొత్త నియమం జూన్ 17, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఇది రాబోయే సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. ఈ కాలంలో బ్యాంకులు సేకరించే కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లతో పాటు, మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత తిరిగి రెన్యూవల్ డిపాజిట్లకు కూడా ఈ వడ్డీ పరిమితి మినహాయింపు వర్తిస్తుంది. దీనితో పాటు, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE) డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేట్ల ఆంక్షలను కూడా ఆర్‌బీఐ తాత్కాలికంగా తొలగించింది.
ఎన్‌ఆర్‌ఐలకు ఇదొక సువర్ణావకాశం
సాధారణంగా ప్రవాస భారతీయులు (NRIs) విదేశాలలో తాము సంపాదించిన డాలర్లు, పౌండ్లు లేదా యూరోల వంటి కరెన్సీలను భారతదేశంలో స్థిర డిపాజిట్ల రూపంలో దాచుకోవడానికి ఎఫ్‌సీఎన్‌ఆర్ ఖాతాలను ఉపయోగిస్తుంటారు. ఇప్పటివరకు ఈ డిపాజిట్లపై బ్యాంకులు ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి ఆర్‌బీఐ నిబంధనలు అంగీకరించేవి కావు. కానీ తాజా మినహాయింపుల వల్ల, భారతీయ బ్యాంకులు విదేశీ కస్టమర్లను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున డాలర్లను సేకరించడానికి అంతర్జాతీయ మార్కెట్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేసే వీలుంటుంది.
రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకేనా?
ఈ నెల ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి మరియు దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచడానికి ఆర్‌బీఐ ఇప్పటికే పలు రకాల ఆర్థిక చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులకు 3-5 సంవత్సరాల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లను సేకరించడానికి, పూర్తి హెడ్జింగ్ ఖర్చులను భరిస్తూ రాయితీతో కూడిన ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని కూడా సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించారు.
అన్ని రకాల బ్యాంకులకు వర్తించే కొత్త రూల్స్
ఆర్‌బీఐ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించి కమర్షియల్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు విడివిడిగా అధికారిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే, ఎన్‌ఆర్ఈ, ఎన్‌ఆర్ఓ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లు.. బ్యాంకులు తమ దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్లపై ఇచ్చే సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనను కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ను ఉపయోగించుకుని విదేశాల్లో ఉన్న భారతీయులు తమ స్వదేశంలో సురక్షితంగా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

