Home Loan: సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి త్వరలోనే పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత రిజర్వ్ బ్యాంక్ రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చిన ఆర్‌బీఐ, త్వరలోనే రెపో రేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్ల ఈఎంఐలు భారీగా పెరిగి సామాన్యుల బడ్జెట్‌ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

అక్టోబర్, డిసెంబర్ సమీక్షల్లో వడ్డీ రేట్ల బాదుడు?

నోమురా ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆర్‌బీఐ అక్టోబర్ అలాగే డిసెంబర్ నెలల్లో జరిపే ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ రెండు సమావేశాల్లో చెరో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) రెపో రేటును పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న రెపో రేటు మార్పు చెంది టెర్మినల్ రేటు 5.75 శాతానికి చేరుకుంటుంది. గతంలో పెరిగిన ధరల నియంత్రణ కోసం వరుసగా వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ, ఆ తర్వాత కాస్త ఊరటనిస్తూ కోతలు విధిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ద్రవ్యోల్బణం భయాలు మొదలవ్వడంతో పెంపు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

కూరగాయలు, చమురు ధరల మంట

దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకోవడమే ఈ వడ్డీ రేట్ల పెంపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షపాతం సరిగా లేకపోవడం, ఖరీఫ్ పంటల దిగుబడి గణనీయంగా తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ఆహార పదార్థాల ధరలు, కూరగాయల రేట్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ఇంధన రంగానికీ కాస్ట్ పెరిగింది. ప్రొడక్షన్ తగ్గడంతో చక్కెర, ఉల్లిపాయల ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. రాబోయే ఆరు నెలల కాలంలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.3 శాతానికి చేరుకోవచ్చని అంచనా.

ఆర్థిక వృద్ధిపై ప్రభావం

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు (GDP) ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, పెరుగుతున్న ధరలు సామాన్యుల కొనుగోలు శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆహార పదార్థాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో, ఇతర అవసరాలకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గుతోంది. ఫలితంగా పండగల సీజన్‌లో వినియోగదారుల ఖర్చులు తగ్గే అవకాశం ఉందని నోమురా పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పత్తి తగ్గితే అక్కడ కూడా వినియోగం మరింత తగ్గుతుంది. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ సేవలు, గ్లోబల్ మార్కెట్ సవాళ్ల వల్ల సర్వీస్ సెక్టార్‌పై కొంత ప్రభావం పడే అవకాశం కనిపించడం ఆర్థిక వ్యవస్థకు కొత్త ముప్పుగా పరిణమించింది.

ఎప్పటి నుంచి ఊరట లభించవచ్చు?

ఈ వడ్డీ రేట్ల పెంపు భయాలు ఎల్లకాలం ఉండకపోవచ్చని కూడా నోమురా నివేదిక స్పష్టం చేసింది. 2027 ప్రారంభం లేదా మొదటి త్రైమాసికం పూర్తయిన తర్వాత భారత మార్కెట్లలో ద్రవ్యోల్బణం మళ్లీ అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2027 ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యమైన 4 శాతం కంటే కిందకు పడిపోవచ్చు. అప్పటి వరకు రుణాలు తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు తక్షణమే ఆ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి కాబట్టి, రాబోయే రోజుల్లో మీ నెలవారీ ఈఎంఐ పెంపునకు సిద్ధంగా ఉండటం మంచిది.

Next Story