RBI : కోట్లాది మందికి ఆర్‌బీఐ బంపర్ గిఫ్ట్.. వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేసిన గవర్నర్
వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేసిన గవర్నర్

RBI : ఆర్బీఐకి చెందిన ద్రవ్యోల్బణ నియంత్రణ కమిటీ(MPC) ఈరోజు దేశ ప్రజలకు పెద్ద ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును ప్రస్తుతమున్న 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశంలో కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న పలు ఆర్థిక సవాళ్లను తట్టుకుంటూనే, దేశీయంగా వృద్ధి రేటును కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు.
గతేడాది కాలంలో 125 బేసిస్ పాయింట్ల కోత
గత ఏడాది కాలపు రికార్డులను గమనిస్తే, జనవరి 2025 నుంచి నేటి వరకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో నాలుగు సార్లు మార్పులు చేసింది. ఈ కాలంలో రెపో రేటును 6.50 శాతం నుంచి ఏకంగా 5.25 శాతానికి తగ్గించారు. అంటే మొత్తం మీద సామాన్యుడికి 1.25 శాతం (125 బేసిస్ పాయింట్లు) మేర వడ్డీ భారం తగ్గింది. గతేడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 0.25 శాతం చొప్పున రేట్లు తగ్గించగా, జూన్ లో అత్యధికంగా 0.50 శాతం మేర భారీ కోత విధించారు. ఆ తర్వాత డిసెంబర్ 2025 లో చివరిసారిగా 5.5 శాతం నుండి 5.25 శాతానికి రేట్లు తగ్గించారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మీటింగుల లాగే ఈసారి కూడా రేట్లను యథాతథంగా ఉంచారు.
లోన్ ఈఎంఐలు, ఎఫ్‌డీలపై ప్రభావం
ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న పాత, కొత్త కస్టమర్ల నెలవారీ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. ఫ్లోటింగ్ రేట్లపై లోన్లు తీసుకున్న వారికి గతేడాదితో పోలిస్తే ఇప్పటికే చాలా వరకు భారం తగ్గింది, అది ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇన్వెస్ట్ చేసే వారికి కూడా ఇది మంచి వార్తే. బ్యాంకులు ప్రస్తుతానికి ఎఫ్‌డీలపై ఇస్తున్న వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. దీనివల్ల ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్లు తమ పొదుపు మొత్తాలపై మునుపటి లాగే ఎక్కువ లాభాలను పొందుతూనే ఉంటారు.
రెపో రేటుతో పాటు ఆర్‌బీఐ తన పరిధిలోని ఇతర ప్రధాన బ్యాంకింగ్ వడ్డీ రేట్లలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు కూడా మునుపటి లాగే 5.5 శాతం స్థాయిలోనే కొనసాగుతాయి. కేంద్ర బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మార్కెట్ లో నగదు లభ్యత స్థిరంగా ఉంటుందని, కస్టమర్లకు కొత్త లోన్లు తీసుకోవడం మరింత సులభతరం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగానికి బూస్ట్
ఈ వడ్డీ రేట్ల స్థిరత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. లోన్ రేట్లు పెరగవనే నమ్మకం కస్టమర్లలో ఏర్పడటం వల్ల మార్కెట్లో కొత్త ఇళ్లు, వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకవైపు దేశ ఆర్థిక రథాన్ని ముందుకు నడిపిస్తూనే, మరోవైపు పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ఆర్‌బీఐ చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తోంది.
రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా పెంపు
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అస్థిరతలు ఉన్నప్పటికీ, భారతదేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉందన్నారు. అయితే రాబోయే మూడో త్రైమాసికంలో (Q3) ధరల సూచీ కొంత మేర పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కారణం చేతనే ఆర్థిక సంవత్సరం 2026-27 కు గాను రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను మునుపటి 4.6 శాతం నుండి 5.1 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కోర్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.

