RBI : పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంట, అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ మన దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం జరగబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో కీలకమైన రెపో రేటును ప్రస్తుతమున్న 5.25 శాతంగానే యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.

జూన్ 3 నుంచి ఆర్‌బీఐ కీలక సమావేశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఈ సమీక్షా చర్చలు జరగనున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత జూన్ 5న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుత అస్థిర పరిస్థితులను తట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ద్రవ్యోల్బణం పెరగొచ్చు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వంటి కారణాల వల్ల ఆర్‌బీఐ తన ద్రవ్యోల్బణ అంచనాలను సవరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని హెచ్చరిస్తూనే, దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాల్లో స్వల్పంగా కోత విధించవచ్చు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో జరిగిన సమావేశంలో కూడా మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావాలను అంచనా వేస్తూ ఆర్‌బీఐ వెయిట్ అండ్ వాచ్ అవలంబించి, వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచిన సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం నివేదిక ఏం చెబుతోంది?

దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో జూన్ ద్రవ్యోల్బణ పాలసీలో యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రాబోయే మూడు త్రైమాసికాలలో 5 శాతం కంటే పైగానే నమోదయ్యే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుత త్రైమాసికంలో ఇది 4 నుంచి 4.1 శాతం మధ్య ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది.

జీడీపీ 6.5 శాతానికి పడిపోనుందా?

ప్రముఖ ఆర్థికవేత్త మదన్ సబనవీస్ (బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్) అభిప్రాయం ప్రకారం.. వచ్చే వారం రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఆర్‌బీఐ తన అప్రమత్తతను కొనసాగిస్తూ ద్రవ్యోల్బణ అంచనాను దాదాపు 5 శాతానికి పెంచే అవకాశం ఉంది. అలాగే దేశ జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ఉన్న 6.9 శాతం నుండి సుమారు 6.5 శాతానికి తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త దీప్తి దేశ్ పాండే కూడా ఆర్‌బీఐ తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు.

ధరల పెరుగుదలకు కారణం ఇదే

ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ధరల పెరుగుదల ఒత్తిడి అంతా సప్లై సైడ్ నుంచే వస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో ప్రధానంగా రవాణా ఖర్చులు పెరగడం, ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటడం, రూపాయి పతనం కావడం వంటివి ఉన్నాయి. కాగా, శుక్రవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ ముందస్తు అంచనా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని, వాటిని సమీక్షిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story