RBI MPC Meet : జూన్ ఆర్‌బీఐ మీటింగ్‌లో వడ్డీ రేట్లు స్థిరం.. కానీ ఆ తర్వాత ఈఎంఐ మోత తప్పదా?
కానీ ఆ తర్వాత ఈఎంఐ మోత తప్పదా?

RBI MPC Meet : ఇళ్లు, వాహనాలు లేదా పర్సనల్ లోన్లు తీసుకొని ప్రతినెలా ఈఎంఐలు కడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారత రిజర్వ్ బ్యాంక్ జూన్ నెలలో జరగబోయే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తాత్కాలిక ఊరటనిచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచే ఆలోచన ఆర్‌బీఐకి లేదని మెజారిటీ అర్థశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం వల్ల ఈ ఏడాది చివర్లో ఈఎంఐల భారం భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ ఆర్థిక వార్తా సంస్థ మనీకంట్రోల్ నిర్వహించిన తాజా సర్వేలో నిపుణులు ఆందోళనకరమైన విషయాలను వెల్లడించారు. రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు వేగంగా మారవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇలాగే అధికంగా ఉండి, నిత్యావసర వస్తువుల ధరలు గనుక అదుపులోకి రాకపోతే.. ఈ ఏడాది అక్టోబర్ నెల తర్వాత జరిగే పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే బ్యాంకులు తమ లోన్లపై వడ్డీలను పెంచుతాయి, తద్వారా సామాన్యుల నెలవారీ ఈఎంఐలు మరింత ఖరీదైనవిగా మారుతాయి.
మనీకంట్రోల్ సర్వేలో పాల్గొన్న 11 మంది ప్రముఖ ఆర్థిక నిపుణులలో అత్యధికులు ఒకే విషయాన్ని స్పష్టం చేశారు. అక్టోబర్ పాలసీ సమావేశంలో లేదా ఆ తర్వాత 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ సర్వే అంచనాల ప్రకారం, ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న ఆర్‌బీఐ పాలసీ రేటు, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఏకంగా 5.75 శాతానికి చేరుకోవచ్చు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పుల వల్ల పంటలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు. మే నెలలో భారత మార్కెట్ కొనుగోలు చేసే క్రూడాయిల్ సగటు ధర బ్యారెల్‌కు 107.96 డాలర్లకు చేరింది, అలాగే రూపాయి విలువ కూడా డాలర్‌కు రికార్డు స్థాయిలో 96.96 కి పడిపోయింది.
ఈ అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం ఇప్పటికే సాధారణ ప్రజల జేబులపై పడటం ప్రారంభమైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.4 వరకు పెంచారు. దీనికి తోడు పాలు, బంగారం ధరలు కూడా రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కారకాలన్నింటి వల్ల రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఇది ఆర్‌బీఐని కఠిన నిర్ణయాలు తీసుకునేలా నెడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య అర్థశాస్త్రవేత్త ఉపాసన భరద్వాజ్ అభిప్రాయం ప్రకారం.. దేశంలో ఇంధన ధరలు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువ అవ్వడం, రూపాయి బలహీనపడటం వల్ల ద్రవ్యోల్బణం ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దేశ ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉండటం కొంతవరకు ఊరటనిచ్చే అంశం. మరోవైపు, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రాకు చెందిన అదితి నాయర్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తాము క్రూడాయిల్ ధరల అంచనాను బ్యారెల్‌కు 85 డాలర్ల నుంచి ఏకంగా 95 డాలర్లకు పెంచినట్లు తెలిపారు. అందువల్ల జూన్ మీటింగ్‌లో ఆర్‌బీఐ చాలా అప్రమత్తంగా వ్యవహరించి రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచవచ్చని పేర్కొన్నారు.
బార్క్లేస్ సంస్థకు చెందిన ఆస్థా గుర్వాణి కూడా పశ్చిమ ఆసియా వివాదాల వల్ల భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు కాస్త మందగించే అవకాశం ఉందని, ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ట పరిమితిని దాటే వరకు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే సాహసం చేయకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, జూన్ నెలలో ఈఎంఐలు పెరగకుండా ఊరట లభించినప్పటికీ, పండుగల సీజన్ వచ్చేసరికి లోన్ల భారం పెరిగే ప్రమాదం పూర్తిగా పొంచే ఉందని స్పష్టమవుతోంది.

