ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఇచ్చిందా ?

Rs.500 Notes : కొన్ని నెలల క్రితం రూ.500 నోట్లను ప్రభుత్వం నిషేధిస్తుందనే వార్త వినిపించింది. ఇప్పుడు అలాంటి వార్తే ఇంకోటి వైరల్ అవుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లను ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తను ఖండించింది. సెప్టెంబర్ 30, 2025 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లను బ్యాంకులు ఇవ్వొద్దని ఆర్బీఐ ఆదేశించిందని ఇకపై ఏటీఎంలలో కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే లభిస్తాయని చెప్పే పోస్ట్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇది ఫేక్ న్యూస్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పీఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్ తమ X అకౌంట్‌లో ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్త స్క్రీన్‌షాట్‌ను జతచేసి, రూ.500 నోట్లను ఏటీఎంలలో నిలిపివేయమని బ్యాంక్‌లకు ఆర్బీఐ ఎటువంటి సూచనలు ఇవ్వలేదని తెలిపింది. ఈ రూ.500 నోట్లు చెల్లుబాటులో ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఆ పోస్ట్‌లో, "ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. అధికారికంగా వార్త వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే అలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోండి" అని హెచ్చరించారు.

ఇదే సమయంలో ఆర్బీఐ రూ.20 ముఖ విలువ కలిగిన కొత్త నోట్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త బ్యాంక్ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. అయితే, ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.20 నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కోల్పోకుండా, యథావిధిగా చెల్లుతాయని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story