Plastic Notes : మన జేబుల్లో నిత్యం మెరిసే కాగితపు నోట్లు త్వరలోనే చరిత్ర పుటల్లో కలిసిపోయే రోజులు దగ్గరపడ్డాయి. దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న నగదు డిమాండ్‌ను తట్టుకోవడంతో పాటు, నలిగిపోయే నోట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. సాంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో.. సరికొత్త ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ముద్రించేందుకు ఆర్‌బీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇటీవల పాట్నా, ముంబై నగరాల్లో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో ఈ కరెన్సీ మార్పుపైనే అత్యంత కీలకమైన చర్చలు జరిగాయని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఈ ప్లాస్టిక్ నోట్లలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇవి వాడుకలో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

మార్కెట్ నుంచి కాగితపు నోట్లను తొలగించడానికి ప్రధాన కారణం వాటి తయారీ ఖర్చు, తక్కువ మన్నిక. ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం.. ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిపై నీరు, తేమ, ధూళి లేదా చెమట ప్రభావం అస్సలు ఉండదు. ఎంత గట్టిగా లాగినా ఇవి అంత ఈజీగా చిరగవు. దీనివల్ల ప్రతి ఏటా పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ముద్రించేందుకు ప్రభుత్వానికి అయ్యే వందల కోట్ల ఖర్చు ఆదా అవుతుంది. అన్నింటికంటే పెద్ద లాభం ఏంటంటే.. ఈ పాలిమర్ నోట్లలో ఉండే హైటెక్ సెక్యూరిటీ ఫీచర్ల వల్ల వీటిని నకిలీ నోట్లుగా మార్చడం దొంగల తాత తరం కూడా కాదు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60కి పైగా దేశాలలో ప్లాస్టిక్ నోట్లు వాడుకలో ఉన్నాయి. కానీ, కొన్ని దేశాలు ఒక అడుగు ముందుకు వేసి.. తమ ఆర్థిక వ్యవస్థ నుండి కాగితపు నోట్లను వంద శాతం పూర్తిగా తుడిచేసి, కేవలం ప్లాస్టిక్ కరెన్సీనే వాడుతున్నాయి. ఆ వింత దేశాల లిస్ట్ ఇదే..

ఆస్ట్రేలియా : ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1988లో ప్లాస్టిక్ నోట్లను పరిచయం చేసిన ఘనత ఆస్ట్రేలియాదే. అంతేకాదు, ఈ పాలిమర్ నోట్లను స్వంతంగా ఉత్పత్తి చేసే ఏకైక దేశం కూడా ఇదే కావడం విశేషం.

న్యూజిలాండ్ : ఈ దేశం 1999 లోనే తన పాత కాగితపు నోట్లన్నింటినీ చెత్తబుట్టలోకి విసిరేసింది. ఇక్కడ కనీసం 5 డాలర్ల నుంచి గరిష్టంగా 100 డాలర్ల వరకు అన్ని నోట్లు ప్లాస్టిక్‌తోనే తయారవుతాయి.

బ్రూనై : ఆగ్నేయాసియాలోనే అత్యంత ధనిక దేశమైన బ్రూనై.. దొంగ నోట్ల ముఠాల ఆట కట్టించేందుకు వంద శాతం ప్లాస్టిక్ కరెన్సీ రూట్ ఎంచుకుంది.

వియత్నాం : ఇక్కడ 2003 లో పాలిమర్ నోట్ల రాజ్యం మొదలైంది. ప్రస్తుతం వోంగ్ అనే కరెన్సీ పూర్తిగా ప్లాస్టిక్ రూపంలోనే ఉంటుంది. ఇక్కడ అత్యంత పెద్ద నోటు విలువ 5 లక్షలు (సుమారు 20 అమెరికన్ డాలర్లు).

రోమేనియా : యూరప్ ఖండం మొత్తంలోనే 2005 లోనే తన దేశంలోని అన్ని నోట్లను వంద శాతం పాలిమర్‌గా మార్చేసిన ఒకే ఒక్క దేశంగా రోమేనియా రికార్డు సృష్టించింది.

పాపువా న్యూ గినియా : ఈ దేశంలో కీనా అనే ప్లాస్టిక్ కరెన్సీ చెలామణిలో ఉంది. ఇంటర్నేషనల్ మీటింగ్‌ల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తొలిసారిగా ఈ దేశంలోనే పర్యటించనుండటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్ల హవా.. మరి అమెరికన్ డాలర్ కథ ఏంటి?

1988 లో ఆస్ట్రేలియా తెచ్చిన 10 డాలర్ల ప్లాస్టిక్ నోటుతో మొదలైన ఈ టెక్నాలజీ ప్రయాణం.. నేడు సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, కెనడా (2011లో మారింది) దేశాలకు విస్తరించింది. అయితే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా భావించే అమెరికన్ డాలర్ మాత్రం వంద శాతం ప్లాస్టిక్‌తో తయారు కాదు. అమెరికా తన నోట్లను కాటన్, లినెన్ లతో కూడిన ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో తయారు చేస్తుంది. అందుకే అవి ప్లాస్టిక్ కాకపోయినా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇప్పుడు అదే బాటలో భారత్ కూడా ప్లాస్టిక్ నోట్లను తేవడానికి వేగంగా అడుగులు వేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story