RBI Policy Boost: ఆర్‌బీఐ గుడ్ న్యూస్..మారని రెపో రేటు..రియల్ ఎస్టేట్ రంగంలో పండగ వాతావరణం
రియల్ ఎస్టేట్ రంగంలో పండగ వాతావరణం

RBI Policy Boost: రియల్ ఎస్టేట్ రంగంలో మళ్ళీ సందడి మొదలైంది. భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం ఇటు ఇల్లు కొనాలనుకునే వారికి, అటు డెవలపర్లకు పెద్ద ఊరటనిచ్చింది. గత ఏడాది కాలంగా రెపో రేటును 6.50% నుంచి వరుసగా తగ్గిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ఇప్పుడు దానిని మార్చకుండా ఉంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఉందనే సంకేతాన్ని ఇచ్చింది. దీనివల్ల హోమ్ లోన్ ఈఎంఐలు పెరగవు సరే కదా, మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది.
రెపో రేటు స్థిరత్వం.. రియల్ ఎస్టేట్ లాభాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. గత ఏడాది కాలంలో రెపో రేటు 6.50 శాతం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ లో 6.25%, జూన్ లో 6.00%, ఆగస్టులో 5.75%, అక్టోబర్ లో 5.50%, డిసెంబర్ లో 5.25% కి చేరింది. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అదే 5.25% వద్ద స్థిరంగా ఉంచడం ద్వారా హోమ్ లోన్ల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని స్పష్టమైంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, మొదటిసారి ఇల్లు కొనేవారికి పెద్ద ఊరట.
ఈ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రెడాయ్ వెస్ట్రన్ యూపీ అధ్యక్షుడు దినేష్ గుప్తా మాట్లాడుతూ.. "రెపో రేటు స్థిరంగా ఉండటం వల్ల కొనుగోలుదారులలో భరోసా పెరుగుతుంది. వడ్డీ రేట్లు అకస్మాత్తుగా మారవనే నమ్మకంతో వారు ధైర్యంగా ఇల్లు కొనే నిర్ణయం తీసుకుంటారు" అని పేర్కొన్నారు. అలాగే నిరాలా వరల్డ్ సీఎండీ సురేష్ గార్గ్ అభిప్రాయం ప్రకారం.. బడ్జెట్ తర్వాత ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లో అనవసరపు ఒడిదుడుకులను తగ్గిస్తుంది. స్థిరమైన విధానాల వల్ల అటు డెవలపర్లు, ఇటు ఇన్వెస్టర్లు మెరుగైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లగలరు.
ఉద్యోగ అవకాశాలు - ఆర్థిక వృద్ధి
రియల్ ఎస్టేట్ రంగం కేవలం ఇళ్ల నిర్మాణానికే పరిమితం కాదు. ఇది స్టీల్, సిమెంట్, పెయింట్, వందలాది ఇతర అనుబంధ పరిశ్రమలతో ముడిపడి ఉంది. రెపో రేటు స్థిరంగా ఉండటం వల్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని విజన్ బిజినెస్ ఫౌండర్ అతుల్ విక్రమ్ సింగ్ తెలిపారు. గృహ రుణాల ఈఎంఐలు స్థిరంగా ఉండటం వల్ల ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం రెసిడెన్షియల్ మార్కెట్ కే కాకుండా కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపిరి పోసింది.

