Paytm Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరో గట్టి షాక్ ఇచ్చింది. ఈ బ్యాంకింగ్ సంస్థను ఆర్‌బిఐ చట్టం, 1934 రెండవ షెడ్యూల్ జాబితా నుంచి అధికారికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2026 ఏప్రిల్ నెలలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్‌బిఐ రద్దు చేసింది. లైసెన్స్ రద్దు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా నుంచి దీనిని తొలగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ చర్యలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కావు. 2024 జనవరి నుంచే ఈ సంస్థపై అనేక రకాల కార్యాచరణ ఆంక్షలు విధించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలం కావడం, బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొత్త డిపాజిట్లు స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలు జరపడాన్ని నిలిపివేస్తూ పాత డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే వినియోగదారులకు అనుమతి ఇచ్చారు.

షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా రద్దు అంటే ఏమిటి?

ఆర్‌బిఐ చట్టం ప్రకారం రెండవ షెడ్యూల్‌లో ఉండే బ్యాంకింగ్ సంస్థలకే షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభిస్తుంది. ఇటువంటి బ్యాంకులు ఆర్‌బిఐ నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందే వెసులుబాటుతో పాటు క్లియరింగ్ హౌస్ సభ్యత్వాన్ని పొందుతాయి. ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆ జాబితా నుంచి తొలగించడంతో, ఇది సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించే అర్హతను పూర్తిగా కోల్పోయింది. బ్యాంకింగ్ విభాగాన్ని పూర్తిగా మూసివేసే ప్రక్రియలో భాగంగానే ఆర్‌బిఐ ఈ తాజా చర్య చేపట్టింది.

పేటీఎం యాప్ యూజర్లపై ప్రభావం ఉందా?

సాధారణ పేటీఎం యాప్‌కు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మధ్య వ్యత్యాసం ఉందనే విషయాన్ని వినియోగదారులు గమనించాలి. పేటీఎం యాప్‌లో అందించే డిజిటల్ చెల్లింపుల సేవలు ఇతర భాగస్వామ్య బ్యాంకుల ద్వారా యథాతథంగా కొనసాగుతాయి. కస్టమర్ల ఖాతాల్లో ఉన్న పాత బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి లేదా ఇతర చెల్లింపులకు వాడుకోవడానికి ఆర్‌బిఐ ఇప్పటికే పూర్తి సడలింపు ఇచ్చింది. 2026 జూలైలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారిక లిక్విడేటర్‌ను నియమించి సంస్థను మూసివేసే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

డిపాజిటర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించే బాధ్యతలపై ప్రస్తుతం యాజమాన్యం దృష్టి సారించింది. ఇతర ఫైనాన్షియల్ పార్టనర్లతో కలిసి డిజిటల్ యూపీఐ చెల్లింపుల సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నందున సామాన్య వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Next Story