RBI Repo Rate : ఈఎంఐ బాధితులకు గుడ్ న్యూస్..ఆర్‌బీఐ గిఫ్ట్ ప్యాక్ రెడీ..ఫిబ్రవరి నుంచి మీ జేబు నిండా డబ్బులే
ఆర్‌బీఐ గిఫ్ట్ ప్యాక్ రెడీ..ఫిబ్రవరి నుంచి మీ జేబు నిండా డబ్బులే

RBI Repo Rate : సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి, ఇప్పటికే భారీ హోమ్ లోన్ ఈఎంఐలు కడుతున్న సామాన్యులకు భారత రిజర్వ్ బ్యాంక్ మరో తీపి కబురు అందించబోతోంది. 2025 డిసెంబర్‌లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించి ఊరటనిచ్చిన ఆర్‌బీఐ, ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో కూడా మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయం అమలైతే మీ జేబుపై ఉన్న భారం మరింత తగ్గి, నెలవారీ ఈఎంఐలు మరింత చౌకగా మారనున్నాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2026లో జరగబోయే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ తన సరళీకృత వైఖరిని కొనసాగించవచ్చు. ఈ భేటీలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా, ఈ కోత తర్వాత అది 5 శాతానికి చేరుకుంటుంది. దీనివల్ల హోమ్ లోన్లే కాకుండా, కార్ లోన్లు, పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు కూడా తగ్గి, సామాన్యుల నెలవారీ బడ్జెట్‌లో పొదుపు పెరుగుతుంది. అయితే, ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేవారికి మాత్రం ఇది కొంత చేదు వార్తే, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గితే డిపాజిట్లపై వచ్చే రాబడి కూడా తగ్గుతుంది.
అసలు ఆర్‌బీఐ వరుసగా వడ్డీ రేట్లను ఎందుకు తగ్గిస్తోంది అంటే.. దేశంలో ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి రావడమే ప్రధాన కారణం. గతంలో వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిని ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు ఆ పరిస్థితి మెరుగుపడింది. ధరల పెరుగుదల ఒత్తిడి తగ్గిందని యూనియన్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా బంగారం ధరల పెరుగుదల వల్ల కలిగే ప్రభావాన్ని మినహాయిస్తే, అసలైన ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాకపోతే, ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకోవడం ఆర్‌బీఐకి కొంత సవాలుతో కూడుకున్నది, ఎందుకంటే ఆ సమయంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటుల గణన కోసం వాడే బేస్ ఇయర్ లో మార్పులు జరగనున్నాయి.
నిజానికి, అప్పులు తీసుకున్న వారికి 2025 సంవత్సరం ఒక వరమనే చెప్పాలి. ఈ ఒక్క ఏడాదే ఆర్‌బీఐ ఏకంగా నాలుగు సార్లు రెపో రేటును తగ్గించి రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 0.25 శాతం చొప్పున తగ్గించగా, జూన్ నెలలో ఏకంగా 0.50 శాతం భారీ కోత విధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మళ్ళీ డిసెంబర్‌లో మరో 0.25 శాతం తగ్గించడంతో రెపో రేటు 5.25 శాతానికి పడిపోయింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో కూడా ఇదే జోరు కొనసాగితే, మార్కెట్లో నగదు లభ్యత పెరిగి, కొత్త లోన్ల కోసం డిమాండ్ ఊపందుకుంటుంది. ఇది అంతిమంగా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.

