RBI: భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంలో కీలకమైన రెపో రేటును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 7న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగే సమావేశంలో రెపో రేటును 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే, బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. దీంతో ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకున్న సాధారణ మధ్యతరగతి ప్రజల నెలవారీ ఈఎంఐల భారం గణనీయంగా పెరగనుంది.

రెపో రేటు పెరిగితే జేబుకు చిల్లే

ఆర్‌బీఐ కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ ఈ రేటు పెంచినప్పుడు బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది. దాంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారులపై మోపుతాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలపరిమితికి 8.5 శాతంతో హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే, వడ్డీ రేటు 0.50 శాతం పెరిగి 9 శాతానికి చేరుతుంది. రుణ మొత్తాన్ని బట్టి నెలవారీ కట్టాల్సిన ఈఎంఐలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.

రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల హోమ్ లోన్ గణాంకాలు ఇవే

* రూ.10 లక్షల లోన్: 8.5 శాతం వడ్డీ వద్ద నెలకు రూ.8,678 ఈఎంఐ ఉంటే, వడ్డీ 9 శాతానికి పెరిగితే ఈఎంఐ రూ.8,997 అవుతుంది. అంటే నెలకు రూ.319, ఏడాదికి రూ.3,828 అదనంగా కట్టాలి.

* రూ.20 లక్షల లోన్: ప్రస్తుతం ఉన్న రూ.17,356 ఈఎంఐ కాస్తా రూ.17,995కి పెరుగుతుంది. నెలకు రూ.638 చొప్పున ఏడాదికి రూ.7,656 భారం పడుతుంది.

* రూ.30 లక్షల లోన్: నెలవారీ ఈఎంఐ రూ.26,035 నుంచి రూ.26,992కి చేరుతుంది. దీనివల్ల నెలకు రూ.957, సంవత్సరానికి రూ.11,484 అదనంగా జేబు నుంచి చెల్లించాల్సిందే.

* రూ.40 లక్షల లోన్: నెలకు రూ.34,713గా ఉన్న ఈఎంఐ రూ.35,989కి పెరుగుతుంది. నెలకు రూ.1,276 చొప్పున ఏడాదికి ఏకంగా రూ.15,312 భారమవుతుంది.

* రూ.50 లక్షల లోన్: రూ.43,391 ఉన్న ఈఎంఐ కాస్తా రూ.44,986కి చేరుతుంది. దీనివల్ల ప్రతి నెలా రూ.1,595 చొప్పున ఏడాదికి దాదాపు రూ.19,140 అదనపు ఖర్చు అవుతుంది.

పర్సనల్ లోన్ ఈఎంఐపై కూడా ఎఫెక్ట్

వ్యక్తిగత రుణాలు ఇప్పటికే ఎక్కువ వడ్డీతో కూడుకున్నవి. రూ.5 లక్షల పర్సనల్ లోన్‌ను 5 ఏళ్ల కాలపరిమితికి 12 శాతం వడ్డీకి తీసుకుంటే ప్రస్తుతం నెలకు రూ.11,122 ఈఎంఐ కడుతుంటారు. ఒకవేళ వడ్డీ రేటు 0.50 శాతం పెరిగి 12.5 శాతానికి చేరితే, కొత్త ఈఎంఐ రూ.11,249 అవుతుంది. అంటే ప్రతి నెలా రూ.127 అదనంగా కట్టాల్సి వస్తుంది. హోమ్ లోన్‌తో పాటు పర్సనల్ లోన్ కూడా నడుస్తుంటే నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం.

ఈఎంఐ పెంచుకోవాలా? లోన్ టెన్యూర్ పెంచుకోవాలా?

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు ఖాతాదారులకు రెండు ఆప్షన్లు ఇస్తాయి. మొదటిది నెలవారీ ఈఎంఐ అమౌంట్ పెంచకుండా లోన్ చెల్లించే కాలపరిమితి (టెన్యూర్) పెంచడం, రెండోది కాలపరిమితి మార్చకుండా ప్రతి నెలా కట్టే ఈఎంఐ పెంచడం. ఈఎంఐ మార్చకపోతే లోన్ కట్టాల్సిన సమయం కొన్ని నెలలు లేదా ఏళ్లు పెరిగిపోయి మొత్తం మీద ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకే నెలవారీ ఈఎంఐ కాస్త పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో భారీ వడ్డీ భారం నుంచి తప్పుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story