RBI : భారతదేశంలో సొంత ఇల్లు, స్థలం లాంటి ఆస్తుల కంటే కూడా అత్యవసర సమయాల్లో ఆదుకునే బంగారానికే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో గోల్డ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) ద్వారా బంగారంపై రుణాలు తీసుకునే ధోరణి జనాభాలో బాగా పెరిగినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. సాధారణ ప్రజలు తమ తక్షణ అవసరాల కోసం బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏడాదిలోనే 70 శాతం పెరిగిన గోల్డ్ లోన్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మే 2026 నాటికి దేశంలోని ఎన్‌బీఎఫ్‌సీలలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బకాయి రుణాల విలువ ఏకంగా రూ.3.29 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి (మే 2025 నాటికి) ఈ రుణాల విలువ కేవలం రూ.1.94 లక్షల కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే బంగారం రుణాల విభాగంలో సుమారు 69.9 శాతం (దాదాపు 70 శాతం) మేర భారీ వృద్ధి నమోదైంది. అత్యవసరంగా డబ్బులు కావాల్సినప్పుడు బంగారంపై సులభంగా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్లు దొరుకుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రిటైల్ లోన్ల విభాగంలో హోమ్ లోన్, కార్ లోన్ల హవా

దేశంలోని మొత్తం రిటైల్ రుణాల విభాగాన్ని పరిశీలిస్తే.. హోమ్ లోన్లు, కార్ లోన్లు, గోల్డ్ లోన్ల విభాగంలో ఈ మే నెలలో పటిష్టమైన వృద్ధి కనిపించింది. గతేడాది మే నెలలో మొత్తం రిటైల్ రుణాల వృద్ధి రేటు 14.9 శాతంగా ఉండగా, ఈ ఏడాది అది వార్షిక ప్రాతిపదికన 19.5 శాతానికి పెరిగింది. బంగారం రుణాలతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు వాణిజ్య రంగానికి ఇచ్చిన రుణాల్లోనూ రెండో అతిపెద్ద వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో బకాయి రుణాలు వార్షిక ప్రాతిపదికన 40.2 శాతం పెరిగి మే నాటికి రూ.1.19 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయానికి ఇవి రూ.85,317 కోట్లుగా మాత్రమే ఉన్నాయి.

వ్యవసాయ రుణాల్లోనూ ముందంజ

గోల్డ్ లోన్లతో పాటు వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు కూడా స్థిరంగా సాగుతున్నాయి. మే 2026లో వ్యవసాయ రుణాల విభాగంలో వార్షిక ప్రాతిపదికన 17.9 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు కేవలం 5 శాతంగానే ఉండటం గమనార్హం, అంటే రైతులకు అందుతున్న రుణాల శాతం గణనీయంగా పెరిగింది. అయితే మరోవైపు పారిశ్రామిక రంగానికి ఇచ్చే రుణాల వృద్ధి రేటు మాత్రం గత ఏడాది 10 శాతం ఉండగా, ఈసారి అది 7.3 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఇచ్చే రుణాల్లో మందగమనం రావడమే దీనికి ప్రధాన కారణం. అలాగే సేవా రంగానికి ఇచ్చే రుణాల వృద్ధి రేటు కూడా మే 2025 నాటి 23.9 శాతం నుంచి ప్రస్తుతానికి 16.7 శాతానికి తగ్గిపోయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story