Scam Alert: ఆర్‌బీఐ పేరుతో కొత్త మోసం.. రూ.లక్ష ఆశచూపి రూ.7,500 నొక్కేసేందుకు కేటుగాళ్ల స్కెచ్
కేటుగాళ్ల స్కెచ్

Scam Alert: దేశంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఈసారి ఏకంగా దేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరునే వాడుకుంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ చేశారు. ఆర్‌బీఐ పేరుతో ఒక నకిలీ లేఖ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎవరికైనా ఆగిపోయిన లేదా నిలిచిపోయిన రూ.లక్ష నగదు కావాలంటే, వారు ముందుగా రూ.7,500 మొత్తాన్ని రిఫండబుల్ టాక్స్ రూపంలో చెల్లించాలనేది ఆ లేఖ సారాంశం. అయితే, కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ విషయాన్ని పరిశీలించి, ఇది పచ్చి అబద్ధమని తేల్చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ లేఖ
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఆ నకిలీ లేఖను చూస్తే ఎవరైనా నిజమే అనుకునేలా డిజైన్ చేశారు. దానిపై ఆర్‌బీఐ పేరు, అధికారిక ముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల రూ.1,00,000 నగదు నిలిచిపోయిందని, ఆ డబ్బును రిలీజ్ చేయించుకోవడానికి రూ.7,500 టాక్స్ ముందుగా కట్టాలని ఆ లేఖలో రాసి ఉంది. అంతటితో ఆగకుండా, ఈ టాక్స్ వంద శాతం రీఫండబుల్ అని, మీరు డబ్బులు కట్టిన కేవలం 10 నిమిషాల లోపే మొత్తం రూ.1,06,800 మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయని నమ్మబలికారు.
రంగంలోకి దిగిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
ఈ లేఖను నమ్మి ఎవరూ డబ్బులు కట్టి మోసపోవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రజలను హెచ్చరించింది. ఈ వైరల్ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా సాధారణ ప్రజల వ్యక్తిగత సొమ్మును హోల్డ్‌లో పెట్టదని, ఏ రకమైన నగదు విడుదలకు కూడా ముందస్తుగా టాక్సులు లేదా ఫీజులు వసూలు చేయదని తేల్చి చెప్పింది. ఇలాంటి గుర్తుతెలియని మెసేజ్‌లు, ఈమెయిల్‌లు లేదా లేఖలను నమ్మి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పంపవద్దని కోరింది.
టాక్స్ కడితే 10 నిమిషాల్లో అకౌంట్‌లోకి రూ.1.06 లక్షలు
ఈ తరహా మోసాలు కొత్తేమీ కాదని, గతంలోనూ ఆర్‌బీఐ పలుమార్లు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. విదేశాల నుంచి భారీ లాటరీ తగిలిందని, తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని లేదా విదేశీ నిధులు విడుదల చేస్తామంటూ గతంలోనూ ఆర్‌బీఐ, దాని ఉన్నతాధికారుల పేర్లను వాడుకుని సైబర్ కేటుగాళ్లు దోపిడీకి పాల్పడ్డారు. ఈ నకిలీ లేఖలో మరింత నమ్మకం కలిగించడానికి, టాక్స్ కట్టాల్సిన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆర్‌బీఐ ఉద్యోగులే ఫోన్ చేసి చెప్తారని రాయడం గమనార్హం. అత్యవసరంగా డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చి క్షణాల్లో అకౌంట్లు ఖాళీ చేయడం వీరి స్టైల్.
రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ ఎవరికీ ఫోన్లు చేయదు
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ప్రజల అవగాహన కోసం కొన్ని కీలక సూచనలు చేసింది. ఆర్‌బీఐ సాధారణ పౌరుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించదు. ఆర్‌బీఐ అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. లాటరీల గురించి ఆర్‌బీఐ ఎన్నటికీ ఉత్తరాలు రాయదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ అడ్రస్ www.rbi.org.in మాత్రమే. దీనిని పోలిన నకిలీ పేర్లు, తప్పుడు లోగోలతో ఉండే వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త వహించాలి.
మీకు కూడా ఇలాంటి ఫేక్ లెటర్స్ లేదా మెసేజ్‌లు వచ్చాయా?
ప్రజలకు సైబర్ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటంటే, ఒకవేళ మీకు కూడా ఆర్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల పేరుతో ఇలాంటి అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు వస్తే వాటిని పూర్తిగా విస్మరించాలి. పొరపాటున కూడా ఎలాంటి నగదు బదిలీలు చేయకూడదు. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ ఇలాంటి మోసపూరిత లేఖలు వస్తే వెంటనే వాటిని మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా గానీ ఫిర్యాదు చేసి రిపోర్ట్ చేయాలి.

