RBI : భారతీయ కార్పొరేట్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశీ కంపెనీలు విదేశీ గడ్డపై చేసే ప్రతి పెట్టుబడి పైనా, అవుట్‌బౌండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పైనా ఆర్‌బీఐ ఇప్పుడు తన నిఘాను తీవ్రం చేసింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపారాల కోసం సుమారు 34 నుంచి 35 బిలియన్ డాలర్ల (దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు) భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఆర్‌బీఐ ఈ కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశాలకు తరలివెళ్లే ఈ భారీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ ఇప్పుడు ఒక గేట్‌కీపర్ పాత్రను పోషిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఒక్కసారిగా ఇంత కఠినంగా మారడానికి బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యమైనది రౌండ్-ట్రిప్పింగ్ కు అడ్డుకట్ట వేయడం. భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నామనే సాకుతో ఇక్కడి డబ్బును విదేశాలకు పంపి, అక్కడ షెల్ కంపెనీలను సృష్టించి, మళ్లీ ఆ నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో భారత్‌లోని షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించకుండా చూడటమే ఆర్‌బీఐ ప్రధాన ఉద్దేశం. దీనితో పాటు మారిషస్, కేమాన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి టాక్స్ హెవెన్ మార్గాల ద్వారా జరిగే పెట్టుబడి ఒప్పందాలపై ఆర్‌బీఐ చాలా సూక్ష్మంగా, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. అలాగే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనలను కంపెనీలు వంద శాతం పాటించేలా చేయడం కూడా ఆర్‌బీఐ ప్రాధాన్యతగా మారింది.

ఈ తనిఖీల్లో భాగంగా అధీకృత డీలర్ బ్యాంకులు కేవలం కంపెనీలు సమర్పించే కాగితాలను చూసి సంతకాలు పెట్టేయకూడదని, ఆయా డీల్స్ వెనుక ఉన్న అసలు కారణాలను లోతుగా పరిశీలించాలని ఆర్‌బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మూడు అంశాలపై కంపెనీలు ఇప్పుడు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిది, ఒక కంపెనీ నేరుగా కాకుండా గ్రూప్ సబ్సిడియరీలు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ వంటి మల్టీ లేవర్ స్ట్రక్ఛర్స్ ద్వారా పెట్టుబడులు పెడుతుంటే వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. రెండోది, ఆ పెట్టుబడి నిజంగా సదరు కంపెనీ వ్యాపార విస్తరణ కోసమేనా లేక కేవలం నిధులను అక్కడ దాచడానికి చేస్తున్న ప్రయత్నమా అనేది నిరూపించుకోవాలి. మూడోది, పెట్టుబడి పెడుతున్న కంపెనీ ప్రమోటర్ల ఆర్థిక చరిత్రను, గతంలో ఏవైనా మనీ లాండరింగ్ లేదా లోన్ డిఫాల్ట్ ఆరోపణలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీ చేస్తున్నారు.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల భారతీయ కార్పొరేట్ రంగానికి స్వల్పకాలికంగా మరియు దీర్ఘకాలికంగా కొన్ని మార్పులు తప్పవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ కఠినమైన తనిఖీల వల్ల భవిష్యత్తులో విదేశీ కంపెనీల కొనుగోళ్లు లేదా విలీనాలకు సంబంధించిన ప్రక్రియ ముగియడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కంపెనీలు ఇకపై అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్లు, అనుమతుల కోసం ముందే పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఎంతో మేలు చేస్తుందని, దీనివల్ల అంతర్జాతీయంగా భారతీయ కంపెనీల విశ్వసనీయత పెరగడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన వివాదాల నుంచి రక్షణ లభిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story