ఇక పై బ్యాంకుల్లో చెక్ క్లియర్ కావాలంటే రెండ్రోజులు అవసరం లేదు

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మార్పును ప్రకటించింది. ఇకపై చెక్కు క్లియర్ అవ్వడానికి రెండు రోజుల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని గంటల్లోనే చెక్ ప్రాసెస్ అయ్యి, డబ్బులు ఖాతాలోకి బదిలీ అవుతాయి. ఈ కొత్త విధానం ద్వారా చెక్ క్లియరింగ్ వేగాన్ని పెంచడం, ఆర్థిక లావాదేవీలలో ఉన్న రిస్క్‌ను తగ్గించడం, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం ఆర్‌బీఐ లక్ష్యం. ప్రస్తుతం చెక్ ప్రాసెస్ అవ్వడానికి T+1 లేదా రెండు వర్కింగ్ డేస్ పడుతుంది. అయితే, ఆర్‌బీఐ ఇప్పుడు ఈ సిస్టమ్‌ను బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి settlement on realization వైపు మారుస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో తెలుసుకుందాం.

చెక్కుల క్లియరింగ్ కోసం నిరంతర, రియల్-టైమ్ సెటిల్‌మెంట్ విధానం అక్టోబర్ 4, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త విధానం కింద, బ్యాంకులు కస్టమర్ల నుంచి అందుకున్న చెక్కులను స్కాన్ చేసి వెంటనే క్లియరింగ్ హౌస్‌కు పంపుతాయి. ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే సెషన్‌లో జరుగుతుంది. ఈ కొత్త వ్యవస్థను ఆర్‌బిఐ రెండు దశల్లో అమలు చేస్తుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి జనవరి 2, 2026 వరకు ఉంటుంది. రెండవ దశ జనవరి 3, 2026 నుంచి పూర్తిస్థాయిలో అమలవుతుంది. మొదటి దశలో, చెక్ ఇచ్చిన తర్వాత, సాయంత్రం 7 గంటలలోపు చెక్ అంగీకరించబడిందా లేదా తిరస్కరించబడిందా అని సంబంధిత బ్యాంకు ధృవీకరించాలి. ఒకవేళ బ్యాంకు నిర్ణీత సమయంలో స్పందించకపోతే, చెక్కును ఆమోదించినట్లుగా భావించి దాని ఆధారంగా చెల్లింపు చేస్తారు.

జనవరి 2026 నుంచి అమలులోకి వచ్చే రెండవ దశలో, సంబంధిత బ్యాంకులకు ప్రతి చెక్ ధృవీకరణ కోసం కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, ఉదయం 10:30 గంటలకు ఒక చెక్ సమర్పించబడితే, సంబంధిత బ్యాంకు మధ్యాహ్నం 1:30 గంటలలోపు దాని స్థితిని తెలియజేయాలి. ఒకవేళ నిర్ణీత సమయంలో ధృవీకరణ రాకపోతే, చెక్ ఆటోమేటిక్‌గా ఆమోదించబడుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం, క్లియరింగ్ హౌస్ నుంచి చెక్ ధృవీకరణ, సెటిల్‌మెంట్ సమాచారం వచ్చిన వెంటనే, చెక్ సమర్పించిన బ్యాంకు కస్టమర్ ఖాతాలో డబ్బు బదిలీ చేయాలి. దీని కోసం ఆర్‌బీఐ ఒక గంట గడువు విధించింది. ఒకవేళ భద్రతా పరమైన సమస్యలు ఏవీ లేకపోతే ఈ గంటలోపే చెల్లింపు పూర్తి చేయాలి. ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు ఒక కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఈ మార్పుల గురించి తమ కస్టమర్లకు స్పష్టంగా, సకాలంలో తెలియజేయాలని సూచించింది. అంతేకాకుండా, నిర్ణీత తేదీలలోపు కొత్త సీటీఎస్ ప్రక్రియకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని కూడా బ్యాంక్‌లను ఆదేశించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story