Rs.2000Note : రూ.2000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఆర్బీఐ కీలక ప్రకటన

Rs.2000Note : భారత రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోటు మీద ఒక కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 2000 నోట్లు ఇకపై ఎక్కువ రోజులు చెలామణిలో ఉండవని స్పష్టం చేశారు. అయితే, అవి లీగల్ టెండర్‌గా ఉంటాయని, అంటే నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చెప్పారు. వాటిని ఆర్‌బీఐ కార్యాలయాల్లో జమ చేయవచ్చు. కాబట్టి, మీ దగ్గర రూ.2000 నోట్లు ఉన్నాయంటే భయపడాల్సిన అవసరం లేదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు రూ.2000 నోట్ల చెలామణి గురించి ప్రశ్నలు అడిగారు. దీనికి సమాధానంగా, సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ నోట్లు ఇకపై మార్కెట్‌లో ఎక్కువ రోజులు కనిపించవని, అయితే వాటి లీగల్ టెండర్ మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అంటే, వాటిని ఇప్పటికీ చెల్లింపులకు ఉపయోగించవచ్చు లేదా బ్యాంక్‌లలో జమ చేయవచ్చు.
ఆర్‌బీఐ ఏడాది క్రితమే రూ.2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ, పీటీఐ నివేదిక ప్రకారం..జూలై 1, 2025 నాటికి రూ.6,099 కోట్ల విలువైన నోట్లు ఇంకా మార్కెట్‌లో ఉన్నాయి. ఆర్‌బీఐ మే 19, 2023న ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుండి, బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్ల వివరాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది.
2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్‌బీఐ కొత్తగా రూ.2000 నోటును విడుదల చేసింది. ప్రజలు తమ రూ.2000 నోట్లను దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుండి అయినా ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలకు తిరిగి ఇచ్చి, దానికి సమానమైన మొత్తాన్ని తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. డిసెంబర్ 2024 నాటికి దాదాపు 98.08% నోట్లు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. మే 19, 2023న రూ.3.56 లక్షల కోట్లు ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ నవంబర్ 29, 2024 నాటికి రూ.6,839 కోట్లకు తగ్గింది.
రూ.2000 నోట్లను ఎక్కడ జమ చేయాలి?
భారత రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, ప్రజలు అక్టోబర్ 7, 2023 వరకు ఏదైనా బ్యాంక్ శాఖలో ఈ నోట్లను జమ చేయడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత, అక్టోబర్ 9, 2023 నుండి ఈ సౌకర్యం భారతదేశం అంతటా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేయబడింది. ప్రస్తుతం, వినియోగదారులు ఆర్‌బీఐ కార్యాలయాలైన అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో తమ నోట్లను జమ చేయవచ్చు.
