అంతర్జాతీయ మార్కెట్లో ఆర్‌బీఐ దూకుడు.. డీలాపడ్డ డాలర్

Dollar Vs Rupee : అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఒక వింతైన, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంటోంది. ఇరాన్ యుద్ధ వాతావరణం, ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరల వల్ల ప్రపంచ దేశాల కరెన్సీలన్నీ డాలర్ ధాటికి కుదేలవుతుంటే, భారత రూపాయి మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. ఒకానొక దశలో బలహీనపడిన రూపాయి, శుక్రవారం నాటికి డాలర్‌తో పోలిస్తే 92.59 వద్ద బలంగా నిలబడటం ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రూపాయిని కాపాడేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మార్చి నెల చివరి నుంచి విదేశీ మార్కెట్లలో రూపాయిని కావాలని బలహీనపరిచే షార్ట్ పొజిషనింగ్ క్రీడ మొదలైంది. రూపాయి విలువ పడిపోతుందంటూ బెట్టింగ్ కట్టే వారిని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. దేశీయ బ్యాంకులకు ఉండే విదేశీ కరెన్సీ పరిమితిని కేవలం 100 మిలియన్ డాలర్లకే పరిమితం చేస్తూ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకులు మరియు సట్టా వ్యాపారులు తాము అప్పటికే చేసిన దాదాపు 30 బిలియన్ డాలర్ల వ్యాపారాలను ఒక్కసారిగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల మార్కెట్లో ఒక్కసారిగా డాలర్ల అమ్మకాలు పెరిగి, రూపాయి విలువ బలపడింది.

రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. అకస్మాత్తుగా డీల్స్ క్లోజ్ చేయాల్సి రావడంతో బ్యాంకులు సుమారు రూ.5,000 కోట్ల ($539 మిలియన్లు) నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషణ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే దాదాపు 32 మిలియన్ డాలర్ల మేర నష్టపోవచ్చని సమాచారం. 2013 తర్వాత హెడ్జింగ్ ఖర్చులు అత్యధిక స్థాయికి చేరుకోవడం బ్యాంకులకు తలనొప్పిగా మారింది.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రూపాయికి ఊపిరి పోసినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లలో మాత్రం భయాందోళనలు రేకెత్తించింది. భారత్ మళ్ళీ క్లోజ్డ్ ఎకానమీ వైపు వెళ్తోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ ఆందోళనతో విదేశీ ఇన్వెస్టర్లు మన బాండ్ మార్కెట్ నుంచి దాదాపు ఒక బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. గత దశాబ్ద కాలంగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

ప్రస్తుతానికి అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ వల్ల ముడి చమురు ధరలు కొంత తగ్గాయి, ఇది రూపాయికి సానుకూల అంశం. అయితే యుద్ధం గనుక మళ్ళీ మొదలైతే చమురు ధరలు పెరిగి, మన కరెన్సీపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ.. ఈ ఆంక్షలు శాశ్వతం కావని, మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్వెస్టర్లను ఊరడించే ప్రయత్నం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story