Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్స్
తక్కువ వడ్డీకే లోన్స్

Gold Loan : బంగారం కుదువ పెట్టి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన సమీక్షను ప్రకటించిన తర్వాత మీడియా సమావేశంలో ఈ విషయంపై పెద్ద సంకేతాలు ఇచ్చారు. గోల్డ్ లోన్లకు సంబంధించి కొంతకాలం క్రితం ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల డ్రాఫ్ట్ విడుదల చేసింది. ఇప్పుడు అవి నిబంధనలుగా మారబోతున్నాయి. త్వరలోనే అమలులోకి రానున్నాయి. దీని వల్ల ముఖ్యంగా రూ.2.5 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సిలు) వరకు గోల్డ్ లోన్లను ఇస్తున్నాయి. అయితే, వాటిలో ఒకే రకమైన నిబంధనలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ లోన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తయారు చేసింది. దీనిపై భారత ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం ఆర్బీఐకి కొన్ని సూచనలు చేసింది. ఇప్పుడు ఆర్బీఐ ఆ సూచనలను మార్గదర్శకాల్లో చేర్చుకునే సంకేతాలు ఇచ్చింది. ఆర్బీఐ గవర్నర్ ఈ మార్గదర్శకాలను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఆర్బీఐని రూ.2 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఉపశమనం ఇవ్వాలని కోరింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.2.5 లక్షల వరకు గోల్డ్ లోన్ కోసం కొత్త నిబంధనలను తయారుచేసినట్లు చెప్పారు. ఇప్పుడు బంగారం కుదువ పెట్టి రూ.2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ గోల్డ్ లోన్ తీసుకునే వారికి వారి బంగారపు విలువలో 85 శాతం వరకు రుణం లభిస్తుంది. అంతేకాకుండా, ఈ 85 శాతంలో గోల్డ్ లోన్ వడ్డీ కూడా కలిసి ఉంటుంది.
ఆర్బీఐ మొదట విడుదల చేసిన డ్రాఫ్టులో ఈ పరిమితి 75 శాతం ఉండేది. అయితే, అప్పుడు వడ్డీని విడిగా లెక్కించేవారు. ఆర్బీఐ గవర్నర్ వివరించిన దాని ప్రకారం.. 75 శాతం విలువలో వడ్డీని కలిపినప్పుడు, సాధారణ ప్రజలకు బంగారపు విలువలో కేవలం 65 శాతం వరకు మాత్రమే రుణం లభించేది. ఒకవేళ 75 శాతం విలువకు అదనంగా వడ్డీని లెక్కిస్తే, మొత్తం విలువ 88 శాతం వరకు చేరేది. అందుకే ఇప్పుడు, వడ్డీతో సహా రూ.2.5 లక్షల కంటే తక్కువ రుణాలకు కుదువ పెట్టిన బంగారం విలువలో 85 శాతం వరకు రుణం లభిస్తుంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, గోల్డ్ లోన్ కోసం కుదువ పెట్టే బంగారం 'ఓనర్షిప్' (యజమానిత్వం) గురించి కూడా స్పష్టత ఇచ్చారు. గోల్డ్ లోన్ కోసం కుదువ పెట్టే బంగారం తమదే అని నిరూపించుకోవడానికి, కస్టమర్లు ఇన్వాయిస్ (బంగారం కొన్న బిల్లు) లేదా కొనుగోలు రికార్డు ఇవ్వాలని ఆయన అన్నారు. ఒకవేళ ఇన్వాయిస్ లేకపోతే, ఒక సాధారణ అండర్టేకింగ్ (బంగారం తమదే అని రాసిచ్చే పత్రం) కూడా ఇవ్వవచ్చని చెప్పారు.
