ఆర్‌బీఐ సచేత్ పోర్టల్ ద్వారా ఇంట్లోనే ఫిర్యాదు చేయండి

RBI SACHET : డిజిటల్ టెక్నాలజీ మన జీవితాన్ని ఎంత సులభం చేసిందో, అదే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాల వంటి కొత్త ప్రమాదాలను కూడా తీసుకొచ్చింది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు పోంజీ స్కీములు లేదా చిట్‌ఫండ్ల వంటి మోసాలలో చిక్కుకుని కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. మోసపోయిన తర్వాత బాధితులు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగలేక వదిలేసుకుంటున్నారు. అయితే మీరు ఇలాంటి ఆర్థిక మోసానికి గురైతే ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఆన్‌లైన్ పోర్టల్ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది.

సాధారణంగా ఆన్‌లైన్ లేదా పెట్టుబడి మోసం జరిగినప్పుడు, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా? సెబీకి చెప్పాలా? అనే సమస్య ప్రధానంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే RBI SACHET(సచేత్) అనే పోర్టల్‌ను ప్రారంభించింది. అక్రమ డిపాజిట్లు, మోసపూరిత పథకాలను అరికట్టడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. ఈ పోర్టల్ గొప్పదనం ఏంటంటే.. మీ ఫిర్యాదును ఏ విభాగం పరిష్కరించాలో మీకు తెలియకపోయినా ఫర్వాలేదు. మీరు ఫిర్యాదు నమోదు చేయగానే ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా మీ ఫిర్యాదును సరైన రెగ్యులేటర్ (RBI, SEBI, IRDAI లేదా స్థానిక పోలీసులు)కు పంపుతుంది. అంటే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇది ఒకే వేదికగా పనిచేస్తుంది.

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా పోంజీ స్కీమ్, చిట్‌ఫండ్ లేదా నకిలీ పెట్టుబడి పథకంలో మోసపోయి ఉంటే, ఈ పోర్టల్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో sachet.rbi.org.in అని టైప్ చేయండి. హోమ్ పేజీలో కనిపించే File a Complaint అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మోసం చేసిన కంపెనీ, యాప్ లేదా వ్యక్తి వివరాలు (చిరునామా, వెబ్‌సైట్, ఫోన్ నంబర్ వంటివి) నింపండి. మీకు జరిగిన మోసాన్ని వివరంగా రాయండి. ఎప్పుడు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత లాభం ఇస్తామని చెప్పారు, ఇప్పుడు కంపెనీ ఏం చెబుతోంది వంటి విషయాలను స్పష్టంగా వివరించండి.

ఈ కేసును ఎవరు పరిష్కరిస్తారో మీకు తెలియకపోతే మీరు నేరుగా I am unable to identify the regulator(రెగ్యులేటర్‌ను గుర్తించలేకపోతున్నాను) అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఫిర్యాదు పూర్తి చేసి సమర్పించగానే, మీకు ఒక ప్రత్యేక నంబర్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఉచితం.

మీ ఫిర్యాదు బలంగా ఉండి, దానిపై త్వరగా చర్య తీసుకునేలా చేయాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీ ఫిర్యాదులో ఎటువంటి అస్పష్టత ఉండకూడదు. నన్ను మోసం చేశారు అని కాకుండా, తేదీ, సమయం, మోసపోయిన మొత్తాన్ని స్పష్టంగా పేర్కొనండి. డిజిటల్ ప్రపంచంలో సాక్ష్యాలే కీలకం. మీ వద్ద బ్యాంక్ లావాదేవీల రసీదు, పెట్టుబడి ప్రామిసరీ నోట్, వాట్సాప్ చాట్‌ల స్క్రీన్ షాట్‌లు లేదా ఇతర ఆధారాలు ఉంటే, వాటిని పోర్టల్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయండి. డాక్యుమెంట్లు లేకుండా మీ ఫిర్యాదు బలహీనపడవచ్చు. ఒకే మోసంలో చాలా మంది చిక్కుకుంటే, మీరందరూ కలిసి గ్రూప్ ఫిర్యాదు కూడా చేయవచ్చు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story