Budget 2026 : బడ్జెట్ 2026పై రియల్ ఎస్టేట్ ఆశలు..హోమ్ లోన్ ట్యాక్స్ రాయితీలు పెరగనున్నాయా?
హోమ్ లోన్ ట్యాక్స్ రాయితీలు పెరగనున్నాయా?

Budget 2026 : దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2025లో దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కొంత నెమ్మదించాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది అమ్మకాలు సుమారు 12 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉత్తరాది నగరాల్లో మందగమనం కనిపిస్తుంటే, దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరులో మాత్రం రియల్ ఎస్టేట్ జోరు తగ్గకపోవడం విశేషం.
2024లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో సుమారు 4,36,992 ఇళ్లు అమ్ముడవగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,86,365కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడం, హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు భారమవ్వడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొనుగోలుదారులు ఇప్పుడు గతంలో కంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ధరలు తగ్గుతాయేమోనని లేదా బడ్జెట్‌లో ఏవైనా రాయితీలు వస్తాయేమోనని వేచి చూస్తున్నారు. అయితే ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి నగరాల్లో అమ్మకాలు తగ్గినా, కోల్‌కతాలో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉన్నా, దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు మాత్రం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి. 2025లో ఈ మూడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 15 శాతం పెరిగి 1.33 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటం, ఇక్కడి ప్రజల ఆదాయం స్థిరంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మిడ్-సెగ్మెంట్ ఇళ్లకు హైదరాబాద్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. బిల్డర్లు కూడా మార్కెట్ పరిస్థితిని బట్టి కొత్త ప్రాజెక్టులను నియంత్రిస్తూ, ధరలు పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై రియల్ ఎస్టేట్ రంగం గంపెడాశలు పెట్టుకుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే మినహాయింపు పరిమితిని పెంచాలని డెవలపర్లు కోరుతున్నారు. గంగా రియాల్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ్ కుమార్ మిశ్రా అభిప్రాయం ప్రకారం.. హోమ్ లోన్లపై ట్యాక్స్ డిడక్షన్ పెంచితే ఇళ్లు కొనేవారి సంఖ్య మళ్లీ పెరుగుతుంది. అలాగే, అఫోర్డబుల్ హౌసింగ్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను పొడిగించాలని, స్టాంప్ డ్యూటీని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెట్రో కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్‌గా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది.
కేవలం రాయితీలు మాత్రమే కాకుండా, ప్రభుత్వ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని రియల్ ఎస్టేట్ సంస్థలు కోరుతున్నాయి. సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి వస్తే ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయని, దీనివల్ల బిల్డర్లకు ఖర్చు తగ్గి, సామాన్యులకు తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయని త్రేహాన్ గ్రూప్ ఎండీ సరాన్ష్ త్రేహాన్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకుంటే 2026లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడిలో పడుతుందని, విదేశీ పెట్టుబడులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, 2025ని రియల్ ఎస్టేట్ మార్కెట్ తనను తాను సరిదిద్దుకున్న సంవత్సరంగా చూడాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

